హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోక్ సభ ఎన్నికల వేళ 8 మంది లేడీ పోలీస్ బాస్‌లు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరితో పాటు అత్యంత క్రిటికల్ నియోజకవర్గం హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం, చేవెళ్ల, నల్లగొండ, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కీలక జోన్లలో వారు పోలీస్ బాస్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచార కార్యక్రమాలు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి, ఇంకా ఇతర రాష్ట్రాల సీఎంల సభలు, ర్యాలీలలో ఏ చిన్న సంఘటనలు జరగకుండా విధులు నిర్వహిస్తున్న ఈ లేడీ పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు నగర ప్రజల అభినందనలను పొందుతున్నారు.వారి జోన్లలో జరిగే నేరాల నియంత్రణతో పాటు, శాంతి భద్రతల నిర్వహణలో అందరితో సమన్వయం పర్చుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. మరో వైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, అల్లరి మూకాలను కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఓటర్లకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తునారు.
నిరంతరం అలర్ట్‌గా ఉంటు కింది స్థాయి సిబ్బంది వెంట ఉండి లోపాలు లేకుండా భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ లేడీ పోలీస్ సింగాలు నగర ప్రజలకు ఆదర్శంగా మారారు. మా పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.. చట్ట పరిధిలో పని చేయాలి.. రూల్స్ అతిక్రమిస్తే నో కాంప్రమైజ్ అంటు న్నారు. నిబంధనల ప్రకారం పని చేయడమే మాకు శక్తి, మా బలం అంటున్నారు లేడీ పోలీస్ బాస్‌లు. ఈ లేడీ బాస్‌లు ఎవరంటే.. నార్త్ జోన్ డీసీపీ -రోహిణి ప్రియదర్శిని, మల్కాజిగిరి జోన్ డీసీపీ -పద్మజ , సౌత్ – ఈస్ట్ జోన్ డీసీపీ – జానకి, మేడ్చల్ డీసీపీ- నితిక పంత్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ – రష్మీ పెరుమాల్, సౌత్ జోన్ డీసీపీ -స్నేహ మెహరా, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయి శ్రీ, మహేశ్వరం డీసీపీ – సునీతారెడ్డి, హైదరా బాద్‌లో ఇంత మంది మహిళ పోలీస్ అధికారులు వారి జోన్లలోని శాంతి భద్రతలతో పాటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే ఛాలెంజ్‌ను స్వీకరించి పనిచేస్తుండడం ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో ఓ స్పెషల్ టాక్‌గా నిలుస్తోంది.