ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కాయ్… రాజా కాయ్…

ఒక వైపు ఐపీఎల్ బెట్టింగ్ హీట్ కొనసాగుతుండగానే పందెం రాయుళ్లు ఎన్నికలపై కన్నేశారు. లోక్ సభ ఎన్నికలపైనా జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం అందుతున్నది. గతంలో కంటే ఈ సారి రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారి వేరే చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటే.. మరికొన్ని చోట్ల రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయుళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. లక్షల్లో బెట్టింగ్‌లు పెడుతున్నారు. అభ్యర్థులపై, వారి సాధించే మెజార్టీలపై, మొత్తం పోలింగ్‌లో సదరు అభ్యర్థికి నమోదయ్యే ఓటింగ్ శాతంపై, పార్టీల వారీగానూ బెట్టింగ్‌లు వేస్తున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు అంచనా వేస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడానికి శాయశక్తుల ప్రయత్నించాయి.

అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ అదే దూకుడును ప్రదర్శించగా బీజేపీ తమ గ్రాఫ్ మరింత పెంచుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేసింది. దీంతో పలుచోట్ల టఫ్ ఫైట్ ఉన్నది. ఎన్నికల ప్రచారం మొదలు.. సర్వేలు, రాజకీయ వర్గాల నుంచి సూచనలు, పరిచయం ఉన్న అభ్యర్థుల నుంచి సమాచారం సేకరించి అంచనాలు వేసుకుని బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఐపీఎల్ వచ్చాక బెట్టింగ్‌లు పట్టణం నుంచి గ్రామీణ స్థాయికీ పాకింది. ఈ ఎన్నికలపై బెట్టింగ్ కూడా పట్టణాల నుంచి గ్రామాలకూ చేరినట్టు తెలుస్తున్నదిఈ సారి చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీల మధ్యే హోరాహోరీగా పోటీ ఉన్నది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ తన బేస్ పెంచుకుంటున్నది. మరోవైపు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించింది. వీటితోపాటు.. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మెదక్ వంటి స్థానాల్లో గెలుపోటములను అంత సులువుగా అంచనా వేసే పరిస్థితులు లేవు. ఇలాంటి చోట్ల బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్టు తెలుస్తున్నది.

అభ్యర్థుల పలుకుబడిని బట్టి కూడా ఆయా స్థానాల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మెదక్, మహబూబ్‌నగర్ సీట్లపైనా అభ్యర్థులకు రేషియో ఫిక్స్ చేసి జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలు స్తున్నది. ఈ సారి హైదరాబాద్ ఎంపీ సీటు కూడా హాట్ టాపిక్ అయింది. ఈ స్థానంపైనా పందెంరాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు సమాచారం.. ఫలితాలకు మరో 20 రోజుల సమయం ఉన్నది. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యే వరకు బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అనేట్టుగా ఉన్నారు. ఓటింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతోనూ బెట్టింగ్ జోరుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత మంది కలిసి ఆర్గనైజ్‌డ్‌ గానూ.. మధ్యవర్తులను పెట్టుకుని మరికొందరు బెట్టింగ్‌లు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమైన అంశాలను అంచనా కట్టి రేషియోలు ఖరారు చేసి పందెం వేస్తున్నారు. పోలింగ్‌కు రిజల్ట్‌కు ఎక్కువ గ్యాప్ ఉండటంతో కొంత కమిషన్ ఇచ్చి మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుంటున్నారఇక ఏపీలోనూ మరింత జోరుగా పందాలు నడుస్తున్నాయి.

అక్కడ ఓవరాల్‌గా అసెంబ్లీలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందా? అనే దానిపై, కీలక నాయకులు బరిలో ఉన్న సీట్లపై, ముఖ్య నాయకుల మెజార్టీపై బెట్టింగ్‌లు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేననాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాల్లో బెట్టింగ్ యమాజోరుగా సాగుతున్నది. మంగళగిరి సీటుపైనా బెట్టింగులు జరుగుతున్నాయి.