తెలంగాణ ముఖ్యాంశాలు

భారీ వ‌ర్షాలు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌న్న సీఎం

తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో గ‌త‌ రాత్రంతా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వ‌ర్షాలు పడడంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా ప్రాంతాలు నీటమునగ‌డంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

అలాగే, ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంట‌నే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవ‌కాశం ఉండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు.