ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జనసేనాని ఎక్కడ…

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. నెలల తరబడి ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన నాయకులు.. గెలుపు భారం దేవుడిపై వేసి రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్తున్నారు. ఆపధర్మ ముఖ్య మంత్రి జగన్ కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ కుటుంబసమేతంగా లండన్ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అమెరికా టూర్‌లో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఫామ్ హౌస్‌లో జనసేనాని ఏం చేస్తున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేనాని.. ఎన్డీఏ కూటమి ప్రచారంలో కూడా కీరోల్ పోషించారు.

వారాహి రథయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన ఆయన.. చంద్రబాబుతో కలిసి ఐదు యువగళం సభల్లో.. మోడీతో మూడు సభల్లో పాల్గొని కార్యకర్తల్లో నేతల్లో స్థైర్యాన్ని నింపారు.స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సిఐడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి పొలిటికల్‌గా మరింత యాక్టివ్ అయ్యారు జనసేన అధినేత. రాజమండ్రి జైలు కెళ్లి చంద్రబాబును పరామర్శించి వచ్చిన పవన్.. అప్పుడే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం నాయకులతో సమన్వయం చేసుకుంటూ .. ఆరు నెలలు ముందే అధికార వైసీపీపై ఎన్నికల సమరసంఖం పూరించి సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరనుంచి తాను పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు.. మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి.. ఆరోగ్యం సహకరించపోయినా కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూలమి గెలుపు ఖాయమని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు.

ఇటీవల హైదరాబాదులో ఆయన తన పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జనసేన ముఖ్య నాయకులతో 120 నుంచి 140 సీట్లు వరకు కూటమి గెలుస్తుందని.. జనసేన 18 స్థానాల్లో గెలుపొందుతుందని.. జనసేన పోటీ చేసిన మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని.. ధీమా వ్యక్తం చేశారంట.పోలింగ్ పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లివచ్చారు. పలువురు రాజకీయ నాయకులు రిలాక్సేషన్ కోసం ఫారిన్ టూర్లకు వెళ్తుంటే పవన్ మాత్రం హైదరాబాదులో తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ మధ్య జరిగిన వివాదాన్ని ఆయనే స్వయంగా చక్కదిద్దారంట. విజయం లాంఛనం అయిన తరుణంలో కుటుంబంలో అలాంటి విభేదాలు ఫోకస్ అవ్వడం కరెక్ట్ కాదని నాగబాబుని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.

మరోవైపు ప్రతి నియోజకవర్గంలో బూత్‌ల వారీగా పోలైన ఓట్లు.. కూటమికి వచ్చే మెజార్టీలపై ఆరాదీస్తూ లెక్కలు సేకరిస్తున్నారంట. హైదరాబాద్ నుంచే నియోజకవర్గం వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. జనసేన ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న నియోజకవర్గ నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారంట. రేపు గెలుపొందిన తర్వాత ఎక్కువ శాతం రాజకీయాలకే పరిమితం కావాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తుంది అంటున్నారు నాయకులు. గెలిచాక వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి పొలిటీషియన్‌గా మారాలని భావిస్తున్నారంట.ఆ క్రమంలో ఇప్పటికే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల సమీక్షలు పూర్తి చేసిన జనసేనాని.. గోదావరి జిల్లాల సెగ్మెంట్లలో పోలింగ్ సరళిపై సమీక్షలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన సైనికులు కూటమితో కలిసి పనిచేసిన తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారంట.

కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయవలసిన వాటిపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు. సినిమా పనులు పూర్తి చేసుకోవడానికి ఏడాది టార్గెట్ పెట్టుకున్న పవన్ అప్పటి వరకు కేబినెట్లో చేరే అవకాశం లేదంటున్నారు.