ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..ఎందుకు వెళ్ళాడు ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారని ఏపీ మంత్రి జోగి రమేశ్‌ ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్‌ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్లారని.. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. దోచుకున్న డబ్బును దాచుకోవడానికి దుబాయికి వెళ్లారా? అని అనుమానం వ్యక్తం చేశారు. దుబాయి వెళ్లారా? ఇటలీ వెళ్లారా? అమెరికా వెళ్లారా? అని ప్రశ్నించారు. జూన్‌ 4వ తేదీన కూటమిని ప్రజలు సమాధి చేస్తారని.. త్వరలోనే టీడీపీ అడ్రస్‌ గల్లంతు అవుతుందని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరిపోయే దీపం లాంటి వారని, ఏపీలో టీడీపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులపై విరుచుకుపడ్డారు. విశ్వాసనీయత, విలువలు ఒకవైపు, కుట్రలు, కుతంత్రాలతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు విశ్వాస నీయతపై మొగ్గుచూపారని వెల్లడించారు.

ఎన్నికల్లో కూటమి నాయకులు ఎన్నికుట్రలు పన్నినా , శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా ప్రజల ఆశీస్సులతో గెలువ బోతున్నామని జోస్యం చెప్పారు. జగన్‌ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని జాతీయ సర్వే సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించినా కూడా ఏపీలో వైఎస్సార్‌ జెండా రెపరెపలాడ బోతుందని, శ్రేణులు సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పల్నాడులో శాంతి భద్రతలను ఖూనీ చేసింది టీడీపీ యేనని, ప్రజలను రెచ్చగొట్టింది చంద్రబాబేనని ఆరోపించారు. జూన్‌ 4న వెలువడే ఫలితాల తరువాత కూటమికి సమాధి తప్పదని అన్నారు. ఇప్పటికే కూటమి అధినేత చంద్రబాబు  పారిపోగా, దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలియదని, బీజేపీ నాయకులు కనిపించకుండా పోయారని విమర్శించారు.