జాతీయం రాజకీయం

వారణాసిలో వార్ వన్ సైడే

జూన్ 1న, జరిగే 7వ దశ ఎన్నికల్లో వారణాసిలో వార్ వన్ సైడే ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం శాతం మోడీకే పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్  టు డోర్ ప్రచారం చేశారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో సంజయ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసి లో ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ  అభిమానులేనని, వారంతా కచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని  తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు.  మోడీకి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సోనార్ పుర లో మహిళా బృందంతో  బండి సంజయ్  భేటీ సందర్భంగా   కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు  సంజయ్ కు వివరించారు.  అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్ళతో పాటు ఇరుగుపొరుగు వారితోను ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదే అని సంజయ్ వారికి సూచించారు.
శ్రీ రామ తారక ఆంధ్రా అశ్రమం లో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వి వి. సుందర శాస్త్రి తో భేటీ అయిన బండి సంజయ్ తెలుగు వారి పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని కోరారు. సుబ్రహ్మణ్య జోషి, మహేష్ బాబు తదితర తెలుగు ప్రముఖులతో సంజయ్ కలిసి మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీ, బీజేపీ నాయకులు గజానంద్ జోషి, మహేష్ బాబు, పాఠక్ తో పాటు హైదరాబాదు నుంచి వెళ్లిన బిజెపి నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్  పరిణిత తదితరులు పాల్గొన్నారు.