బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో బెంగళూరు పోలీసులు కీలక వివరాలు వెల్ల డించారు. ఈ పార్టీలో సుమారు 150 వరకు పాల్గొన్నారని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్‌లో పట్టుబడిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదని సమాచారం. ఈ రేవ్ పార్టీలో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీనటులతో పాటు.. వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది.టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నట్లుగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఆమె నిన్న విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు రూ.50 లక్షలు ఎంట్రీ ఫీజు ఉంటుందని చెప్పారు. అలా వంద మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ పార్టీలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని కమిషనర్ వెల్లడించారు.ఈ కేసును ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశామని.. శాంపిల్స్ నివేదికలు వచ్చిన తర్వాత.. డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డ్రగ్స్ పెడ్లర్‌పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. అరెస్టు అయిన వారి సెల్ ఫోన్లు సీజ్ అయ్యాయని చెప్పారు. రేవ్ పార్టీకి ప్రజా ప్రతినిధులు ఎవరూ వచ్చినట్లు సమాచారం లేదని, ఇద్దరు నటులు పట్టుబడి నట్లుగా బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద చెప్పారు. హెబ్బగోడిలోని జీఆర్ ఫాంహౌస్ లో వాసు బర్త్‌డే పేరుతో సన్ సెట్ టూ సన్ రైస్ అనే సబ్ టైటిల్‌తో ఈ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ను గుర్తించారు. ఎండీఎంఏ పిల్స్ తో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పేరున్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరై రాత్రంతా డీజే సౌండ్ మధ్య ఎంజాయ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.సీసీఎల్ పోలీసులు రైడ్ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన పేరున్న వారు కర్ణాటక సరిహద్దులో నివసించే కొంత మంది ఈ పార్టీకి హాజరైనట్లు చెబుతున్నారు.
పార్టీలో ఉన్నవారి అందరి నుంచి శాంపిల్స్ సేకరించామని, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారనే విషయాన్ని గుర్తిస్తామని పోలీసులు చెప్పారు. వీరిలో 25 మంది వరకూ యువతులు, డీజేలు, మోడల్స్, నటీనటులు, టెకీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్ధిఖీ, రణధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు.