- పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
- ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి
- సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
నిర్మల్ జిల్లాలో గురువారం భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 150 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదుకావడంతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 మంది జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గజఈతగాళ్లు, రెస్క్యూ టీంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్‌లో వరద పరిస్థితిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను నిర్మల్‌కు పంపుతామని తెలిపారు. నిర్మల్‌లోని పలు కాలనీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అధికారులతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
జీఎన్‌ఆర్ కాలనీలో ఓ బాలింత, 11 నెలల బాబు జలదిగ్బంధంలో చిక్కుకున్నారని తెలుసుకొని మంత్రి స్వయంగా అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ టీంని పంపి వారిద్దరితోపాటు మరో యువకుడిని రక్షించారు. మంజులాపూర్, మంచిర్యాల్ చౌరస్తా, సిద్దాపూర్, సోఫీనగర్‌కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత గ్రామా లు, కాలనీల నుంచి ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకొని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొన్నది.
దిలావర్‌పూర్‌లో 24.7 సెంటీమీటర్ల వాన
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 24.7 సెంటీమీటర్లు, నర్సాపూర్ (జీ)లో అత్యధికంగా 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారావ్ పల్సికర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో వరద నీరు బ్రిడ్జిపై నుంచి పారుతూ ఇండ్లలోకి చేరింది. స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అక్కడకు చేరుకొని ముంపు బాధితులను ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. భైంసా ఆటోనగర్‌లోని ఎన్‌ఆర్ గార్డెన్‌లో బక్రీద్ పండుగకు వచ్చి వరదలో చిక్కుకున్న 10 మంది పోలీసులు, నలుగురు కార్మికులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జాబీర్ అహ్మద్, ఏఎస్పీ కిరణ్ ఖారే, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే రక్షించారు. సారంగాపూర్ మండలం వంజర్‌లో వరదలో చిక్కుకున్న ముగ్గురు పెయింటింగ్ కార్మికులను కాపాడారు. ఉట్నూర్ మండలం జెండాగూడలో వాగులో చిక్కుకున్న ఉపాధ్యాయున్ని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. కుంటాల మండలం వెంకుర్‌లో వాగు పొంగడంతో వ్యవసాయ పనులకు వెళ్లిన దంపతులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు.