తెలంగాణ ముఖ్యాంశాలు

ముసిరిన వాన.. జరపైలం

  • రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం
  • పొంగిన వాగులు.. పొర్లుతున్న ప్రాజెక్టులు.. హోరెత్తిన జలపాతాలు.. చెరువుల మత్తళ్లు
  • మూడురోజులుగా రాష్ర్టాన్ని కమ్మేసిన వాన
  • 60 చోట్ల 7 నుంచి 20 సెం.మీ. పైగా వర్షం
  • నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 24.7 సెం.మీ.
  • జల దిగ్బంధంలో నిర్మల్‌ జిల్లా పల్లెలు, పట్నాలు
  • అప్రమత్తంగా ఉండండి
  • లోతట్టు ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోండి
  • రాష్ట్రంలో వాన, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంతోపాటు, ఎగువ రాష్ర్టాల్లో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. లోతట్టు, నదీపరీవాహక ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాలని సూచించారు. మరో రెండుమూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముం దస్తు ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అధికారులు, ప్రజలకు అవసరమైనవిధంగా సహాయపడాలని సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల్లో వరద పెరుగుతున్నదని.. వరుసగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో కాలువలు, వాగులు, వంకలు పారుతూ, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఏడాదిపాటు నీటితో నిండి ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కొద్దిపాటి వరద వచ్చి నా ఉధృతి పెరిగే ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. గత పాలనలో తెలంగాణలో కరువు నివారణ చర్యలకు మాత్రమే అలువాటుపడిన అధికారయంత్రాం గం ఇకనుంచి వరద నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టంచేశారు. ఈ మేరకు వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలతోపాటు, తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏడుగురు సభ్యులతో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ టీం
మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇకనుంచి కరువు పరిస్థితులు ఉండవని, వరద పరిస్థితులను ఎదురొనే పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. వరద పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలు ఏవిధంగా చేపట్టాలో తెలిసిన ఏడుగురు సమర్థులైన అధికారులతో ‘వరద నిర్వహణ బృందం’ (ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ టీం)ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, వైద్య, జీఏడీ శాఖల అనుభవజ్ఞులను నియమించాలన్నారు. ఈ బృందం ఆయా శాఖలు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద నివారణ చర్యలు చేపడుతుందని తెలిపారు. ‘వరదల సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన ఉన్న ఉన్నతాధికారులను నియమించాలి. ఈ టీంను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసుకోవాలి. పాత రికార్డులను అనుసరించి వరదల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం వరదల రికార్డును పాటించాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

వరద పరిస్థితులపై ఆరా.. తక్షణ ఆదేశాలు
గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో భారీవర్షాలతో ప్రాజెక్టులకు వస్తున్న వరద, రాష్ట్రంలో మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న తీరును అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. గోదావరికి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతున్నదని తెలిపారు. ముఖ్యంగా నిర్మల్‌, భైంసాతోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద తీవ్రతను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నిజామాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల మంత్రులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. తక్షణ రక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీచేశారు. భయపడాల్సిన అవసరంలేదని ప్రభు త్వం అన్నిరకాల చర్యలను ప్రారంభించిందని ధైర్యం చెప్పారు. ఆర్మూర్‌, నిర్మల్‌, భైంసా ప్రాంతాలకు తక్షణమే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీంలను పంపించాలని ఆదేశించారు. కొత్తగూడెం, ఏటూర్‌నాగారం మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సీనియర్‌ అధికారులు వెళ్లాలని సూచించారు. బాలొండ నియోజకవర్గంతోపాటు నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పర్యవేక్షించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను షెల్టర్‌ హోంలకు తరలించి, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని చెప్పారు.

మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ టీంలను రప్పించాలని, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సీం కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదురొన్న సీనియర్‌, రిటైర్డ్‌ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్‌, ఎలక్ట్రిసిటీ, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖలు పూర్తి సంసిద్ధతతో ఉండాలని చెప్పారు. గంట గంటకు వరద పరిస్థితిని అంచనా వేస్తూ, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని నియంత్రిస్తూ కిందకు వదలాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీశాఖ ఇతర శాఖలతో సమన్వయమవుతూ బ్రిడ్జీలు, రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజారవాణాకు ఆటంకం కలుగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయినుంచి అందరు ప్రజాప్రతినిధులను ఇప్పటికే అప్రమత్తంచేశామని సీఎం తెలిపారు.

మహాబలేశ్వర్‌లో రికార్డు వర్షం
‘మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వర్‌లో 70 సెంటీమీటర్లకుపైగా భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి వరద ఉధృతి పెరిగే అవకాశమున్నది. రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పర్యవేక్షణకు నాగార్జునసాగర్‌ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలని తెలిపారు. రేపటినుంచి నల్లగొండ ఇరిగేషన్‌ సీఈ నాగార్జునసాగర్‌ డ్యాం, వనపర్తి సీఈని జూరాల ప్రాజెక్టు పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.

హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి ?
హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలతోపాటు, మూసీ వరదపై సీఎం కేసీఆర్‌ ఆరాతీశారు. వరద ఉధృతిని ముందుగా అంచనావేసి మూసి పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారి రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థలను ఎప్పటికప్పుడు క్లియర్‌చేయాలని సూచించారు. హైదరాబాద్‌ లోతట్టు ప్రాం తాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలవైపు వెళ్లవద్దని, వరదల్లో చికుకోవద్దని హెచ్చరించారు. వరద ఉధృతిలో వాగులు, వంకలు దాటేలా సాహసకృత్యాలు చేయొద్దని హితవుపలికారు. సమావేశంలో జుకల్‌ ఎమ్మెల్యే హన్మంతు షిండే, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.