- జిల్లా మహిళా సంఘాల కృషి మరువలేనిది
- ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కు ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు’ జ్ఞాపిక అందజేత
సమైక్య పాలనలో వలసలు, ఆకలిచావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షంవ్యక్తంచేశారు. స్వయంపాలనలో ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న జలాలతో ఉమ్మడి జిల్లాలో నేడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదని పేర్కొన్నారు. బీడు భూములు, రాళ్లగుట్టలకే పరిమితమైన పాలమూరు.. పచ్చదనంతో తన రూపురేఖలను మార్చుకున్నదని, వినూత్నరీతిలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో.. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా సీడ్‌బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా మహిళా సంఘాలు సాధించిన ‘గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ జ్జాపికను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్‌కు అందజేశారు. జిల్లాలోని స్వయం సహాయక బృందాలు గత ఏడాది నెలకొల్పిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ తయారీ రికార్డును అధిగమించి.. ఈసారి కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్‌బాల్స్‌ను తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించాయి. ఈ సీడ్‌బాల్స్‌ను జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో వెదజల్లారు. రికార్డును సాధించిన పాలమూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని, జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు.
హరితహారానికి మరింత ఊతం:సీడ్‌బాల్స్ రికార్డుపై ఎంపీ సంతోష్ ట్వీట్
సీడ్‌బాల్స్ తయారీలో పాలమూరు మహిళా సంఘాలు సృష్టించిన గిన్నిస్ రికార్డ్.. గ్రీన్ ఇండి యా చాలెంజ్, హరితహారానికి మరింత ఊతమిస్తుందని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ చేతులమీదుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రం అందుకున్నట్టు ట్వీట్ చేశారు.