బద్వేల్ ఉప ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధను వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు
ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ రావాలని, ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఒటరునూ పలుకరించాలని ఆదేశించారు. సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని, అతి విశ్వాసానికి పోకుండా కష్టపడి పని చేయాలని సమావేశానికి హాజరైన నేతలకు సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బాధ్యతలను మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డికి అప్పగించారు. నెలరోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని సూచించారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌చార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. సోమవారం నుంచి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి.. విజయం సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు.