ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ విశ్వాసం వెనుక…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హైవోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఎవరికెన్ని సీట్లు వస్తాయన్న దానిపై పెద్దగా చర్చ కూడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందన్న దానిపై కనీ వినీ ఎరుగని రీతిలో బెట్టింగులు జరుగుతున్నాయి. ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయింది. ఇప్పుడు రాజకీయ  పార్టీలు చేయగలిగిందేమీ లేదు. ఆట చివరి వరకూ తమదే విజయం అన్నట్లుగా పోరాడారు. ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. కానీ మేమంటే మేము గెలుస్తామని రెండు పార్టీలు ప్రకటిస్తున్నాయి. రెండు పార్టీల్లో అధికార పార్టీ ఇంకా ఎక్కువగా తమ గెలుపు నమ్మకాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. ఖచ్చితంగా గెలుస్తామని విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెబుతున్నారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను రెండో సారి గెలి్సతే విశాఖ నుంచే పాలన చేస్తానని అక్కడే ప్రమాణస్వీకారం చేస్తానని ముందుగానే ప్రకటించారు. అందుకే రెండో సారి గెలిస్తే ఎక్కడ ప్రమాణం అనే ప్రశ్న వైసీపీలో లేదు.

కానీ విశాఖలో వెన్యూ ఎక్కడ.. ఎప్పుడు అనేది కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ సీఎంగా రెండో జగన్మోహన్ రెడ్డి తొమ్మిదో తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని దాదాపుగా ప్రతీ రోజూ చెబుతున్నారు.   ముహుర్తాన్ని కూడా వైవీ  సుబ్బారెడ్డి ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉదయం 9.30కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించేశారు.  మాములుగా అయితే జగన్ ప్రమాణ స్వీకార ముహు ర్తాన్ని స్వరూపానంద ఖరారు చేస్తారు. ఆయనను సంప్రదించి వైవీ సుబ్బారెడ్డి ముహుర్తాన్ని ఖరారు చేశారో.. టీటీడీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో ఆయనే పెట్టేశారో స్పష్టత లేదు. తాజాగా హోటల్ రూముల్ని బుక్ చేస్తున్నామని చెబుతున్నారు. విశాఖలో ఉన్న  స్టార్ హోటల్స్ అన్నింటినీ తొమ్మిదో తేదీ కోసం బుక్ చేస్తున్నామని జగన్ ప్రమాణస్వీకారానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రము ఖులు వస్తారని అంటున్నారు. బోగాపురం ఎయిర్ పోర్టు దగ్గర ఉన్న  ఖాళీ ప్రదేశంలో అత్యంత భారీగా బహిరంగసభలో ప్రమాణస్వీకారం చేయాలా.. లేకపోతే విశాఖలో ఏయూ గ్రౌండ్‌ లో చేయాలా అన్నదానిపై పరిశీలన  చేస్తున్నామని చెబుతున్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే కేవలం వైసీపీ నేతలే ఏర్పాట్లలో మునిగి ఉండటం లేదు.. అధికారులు కూడా ఏర్పాట్లలో పాల్గొంటున్నారని అంటున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి రెండు సార్లు సీక్రెట్ గా విశాఖకు వచ్చారు. ఓ సారి బోగాపురం వెళ్లి పరిశీలించారు. మరికొంత మంది ఉన్నతా ధికారులు కూడా వచ్చి వెళ్లారని చెబుున్నారు. వీరంతా వచ్చింది జగన్ రెండో సారి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై పరిశీలన చేయడానికేనని అంటున్నారు. సాధారణంగా ఫలితాలు ఈవీఎంలతో నిక్షిప్తమయ్యాక రాజకీయ పార్టీల రిలాక్స్ అయిపోతాయి. సమయం ఉంటే పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటారు. నిజానికి పోలింగ్ సరళి వల్ల ఫలితాలు అంచన వేయడం అాసాధ్యం. తమ కు గతంలో ఎక్కువ ఓట్లు ఎక్కడ వచ్చాయో.. అక్కడ ఓటింగ్ శాతం ఎలా ఉందో చూసు కుంటాయి. ఏ ఏ సామాజికవర్గాల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయో తెలుసుకుని అంచనా వేసుకుంటారు. ఇవేమీ ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితాల తర్వాత ఎక్కువగా ట్రోలింగ్ కు గురి కాకుండా  ఉండేందుకు సంయమనం పాటిస్తాయి.

పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం ఉండేలా..  గెలుస్తున్నామన్న నమ్మకాన్ని కలిగించేందుకు గీత దాటకుండా ప్రయత్నాలు చేస్తాయి. కానీ వైఎస్ఆర్‌సీపీ మాత్రం తమ నమ్మకాన్ని ప్రజల ముందు ప్రదర్శించా లనుకుంటోంది. అది ప్రమాణస్వీకార ముహుర్తం.. ప్రమాణస్వీకార వేదిక ఏర్పాట్లు ప్రారంభించడం. . హోటల్ రూమ్స్  బుక్ చేసుకోవడం వరకూ వెళ్లడమే ఆసక్తికరంగా మారింది.  అత్యధిక పోలింగ్ నమోదు కావడం  , మధ్యతరగతి వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం, ఉద్యోగ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పని చేశాయన్న విశ్లేషణల మధ్య వైఎస్ఆర్‌సీపీకి ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ సెఫాలజిస్టులు అందరూ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారుతుందన్న అంచనాలను వేయడం ప్రారంభించారు.

ఇవి జాతీయ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు వచ్చిన జాతీయ మీడియాల ఒపీనియన్ పోల్స్ లోనూ వైసీపీకి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో వైసీపీ నేతల్లోనే గందరగోళం ఏర్పడింది. ఓ వైపు ఈసీ అక్రమాలు అని పోరాడుతూండటంతో ఫలితాలపై క్లారిటీ ఉందని.. అందుకే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. దీన్ని  కంట్రోల్ చేసేందుకే .. ప్రమాణస్వీకార తేదీ, ముహుర్తం, వేదిక పేరుతో హడావుడి చేస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ముందే హైకమాండ్ జావకారిపోతే కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు కూడా ధైర్యంగా  ఉండలేరని.. అక్కడ ఏజెంట్ల లేకపోతే సమస్యలు వస్తాయని ఇలాంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతల గెలుపు నమ్మకం ప్రదర్శన కాస్త అతిగానే ఉంది. ఫలితాలు రోజున.. తాము అనుకున్నట్లుగా గెలిస్తే పర్వాలేదు.. ఫలితం తేడా వస్తే.. మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తారు. అటు ఓటమి బాధతో పాటు గెలిచినపార్టీ నేతల ట్రోలింగ్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.