తెలంగాణ

రెమాల్…బీభత్సమైన నష్టం…

తెలుగు రాష్ట్రాలపై రీమల్‌ తుఫాన్  ప్రభావం తీవ్రంగా ఉంది. ఓ వైపు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అంతలోనే వాతావరణం మారిపోతుంది. తెలంగాణ లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు బీభత్సం స‌‌ృష్టిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి ప్రజలు ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో 15 మంది వరకు చనిపోయారు. భారీగా భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మల్లేష్‌ (38), అతని కుమార్తె అనూష (11), పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (37) రాములు(40) అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లా తిమ్మాయిపల్లిలో చెట్టుకొమ్మలు విరిగిపడి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంనకు చెందిన నాగిరెడ్డి రామిరెడ్డి, ధనంజయ్య దుర్మరణం చెందారు.
 కోళ్లఫారం గోడ కూలి..
ములుగు మండలం క్షీరాసాగర్‌లో గోడ కూలి ఇద్దరు మరణించారు. ఈదురుగాలుల ధాటికి కోళ్లఫారం గోడ కూలడంతో గణపురం గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌ (30), చంద్రాయణగుట్టకు చెందిన భాగ్య(40) చుట్టాల వద్దకు వచ్చి మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర షెడ్డుపై నుంచి సిమెంటు ఇటుకలు పడి వికారాబాద్‌ జిల్లా బషీర్‌బాద్‌ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వేణు (34) మృతి చెందాడు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. బిజినేపల్లి మండలం నంది ఒడ్డెమాన్‌లో రైతు అంజన్‌రెడ్డి (49), తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో రైతు కుమ్మరి వెంకటయ్య (55) పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్‌ (12) పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.  హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

వనస్థలిపురం గణేష్‌ ఆలయం రోడ్డులో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. పలు కార్లు దెబ్బతిన్నాయి. హయత్‌నగర్‌-1 డిపోలో చెట్టు విరిగి పడడంతో బస్సు ధ్వంసమసైంది. అర్థరాత్రి వరకు విద్యుత్ లేక చాలా కాలనీల్లో జనం అల్లాడిపోయారు. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ, గౌరవెలి ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షం ధాటికి ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్‌ సర్కిల్‌, గచ్చిబౌలి ఔటర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.  
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
రీమల్ తుఫాన్ దాటికి తెలంగాణలో వర్షాలు కురవగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ హెచ్చరించారు. తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం రెండవ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉప్పాడ బీచ్‌ రోడ్డు నుంచి కాకినాడ వెళ్లే వివిధ వాహనాల రాకపోకలను కొత్తపల్లి మండల పోలీసులు ఆపేశారు. గోర్స, పండూరు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకోవాలని సూచించారు.
చిగురుటాకులా వణుకుతున్న బెంగాల్
రీమల్ తుఫాన్‌ ధాటికి పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 110 కి.మీ నుంచి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని తీరప్రాంత గ్రామాల నుంచి లక్షా 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముప్పు అంచున ఉన్న ప్రజలందరినీ తుఫాను శిబిరాల్లోకి తరలిస్తున్నట్లు బంగ్లాదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి కమ్ముల్‌ హసన్‌ తెలిపారు. ప్రజల కోసం సుమారు 4 వేల తుఫాను శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.