ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర విభజన 2014లోనే జరిగినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్ కొనసాగింది. ఉమ్మడి గడువు మరో నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. విభజన సమయంలో హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు జూన్ 2 తరువాత తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీంతో ఇక నుంచి హైదరాబాద్‌తో ఏపికి ఎటువంటి అధికారిక, పరిపాలన సంబంధం ఉండదు. హైదరాబాదులో ఉండే భవనాలకు సంబం ధించిన వివరాలతో కూడా నివేదిక తయారు చేయాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు కూడా. ఇటీవలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాల స్వాధీనంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై మే 20న జరిగిన తెలంగాణ మంత్రి వర్గ భేటీలో చర్చించారు.
అంతకుముందే ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్, అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేసి అధి కారులు అందజేశారు. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్, క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగింపు దశకు చేరుకు న్నప్పటికీ, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఫిల్మ్ డెవలప్‌మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్‌టిపిసి, ఆర్‌టిసి, సింగరేణి, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు కొలిక్కి రాలేదు.ఇటీవల ఢిల్లీలో ఉన్న ఏపి భవన్ పంపకం అయింది.
విభజన చట్టం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపి, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే ఢిల్లీలో ఉన్న ఏపి భవన్, భూమి పంపకంపై రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు అటు హైదరాబాద్, ఇటు విజయవాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యాలయాలను న్యాయ రాజధాని పిలవబడే కర్నూల్ కు మార్చినప్పటికీ ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత రాలేదు.అయితే ఇటీవలి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే, జూన్ 2నే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగుస్తుంది.ఏపి, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఎపికి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1,200 మంది వరకూ ఉన్నారు. ఏపి నుండి తెలంగాణకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1,600 మందికిపైగా ఉన్నారు.
విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాని పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఉద్యోగుల కేటాయింపుపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగుతుందనే సందర్భాలలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీనివల్ల ఉద్యోగాలు కేటాయింపు కూడా మధ్యలోనే ఆగిపోయింది. విద్యుత్ బకాయిలకు సంబంధించి రూ.8 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపికి ఇవ్వల్సి ఉంది. అయితే ఈ అంశం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.విద్యుత్ బకాయిలు ఇప్పించాలని ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి, గత సిఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తేల్చకుండా మధ్యలోనే వదిలేసింది.