తెలంగాణలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టార్గెట్‌గా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందా.. ఈ ఆపరేషన్ వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా ఉత్తమ్‌పై ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణలను ఉత్తమ్ ఖండిస్తున్నా.. ఆయనకు అధికార పార్టీ నుంచి ఎవరూ అండగా నిలవడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. సోమవారం బయటపెడతానని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ దృష్టి ఉత్తమ్‌పై పడింది. ఇప్పటికే యూ ట్యాక్స్ అంటూ మహేశ్వర్‌రెడ్డి ఇటీవల ఉత్తమ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననిపించుకునేందుకు ఉత్తమ్ కాంగ్రెస్ అధిష్టానానికి కోట్ల రూపాయలు పంపించాడని ఆరోపించారు.
ఒకవైపు మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలపై చర్చ జరుగుతుండగానే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టార్గెట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఉత్తమ్ రూ.1,100 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. ఒకవైపు మహేశ్వర్‌రెడ్డి ఆధారాలు బయట పెట్టకముందే.. ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడకుండా ఉండేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. పక్కా లెక్కతో ఆరోపణ చేశారు. బ్లాక్ లిస్టులో ఉంచిన కేంద్రీయ భండార్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది కూడా జేబులు నింపుకోవడానికే అని ఆరోపించారు. ఆరోపణలు ఎలా ఉన్నా.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఎలాంటి ఆధారాలు బయటపెడతారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. నిజంగా ఆధారాలు ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. పౌరసరఫరాల శాఖలో అవతకవకలు జరిగాయని మహేశ్వర్‌రెడ్డి పేర్కొంటున్నారు.
మరోవైపు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిజంగానే అవినీతికి పాల్పడ్డారా లేదంటే సివిల్ సప్లయ్ అధికారులే ఉత్తమ్ కళ్లుగప్పి అవినీతి చేశారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తగా ఉత్తమ్ లక్ష్యంగా ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఆరోపణలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికార పార్టీని కాదని పౌర సరఫరాల శాఖలో అవినీతికి సంబంధించిన ఆధారాలు విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఎవరు ఇచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలోనే ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఎవరైనా పావులు కదుపుతున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది.