singareni
తెలంగాణ రాజకీయం

సింగరేణిలో మోగిన ఎన్నికల సైరన్‌

కార్మిక క్షేత్రం ఎన్నికల పోరుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతంలో రాజకీయ కోలాహలం మొదలైంది. ఒకరకంగా ఎన్నికలు రెఫరండమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో బొగ్గు గని కార్మిక క్షేత్రంలో జంగ్ సైరన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్ గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్థానాలపై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బొగ్గు బావులు విస్తరించి ఉండడమే దీనికి కారణం. ఈనెల ఆరో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అంతకుముందే ఓటర్ల జాబితా, తప్పుల సవరణ తుది జాబితా ప్రకటన చేపట్టనున్నారు. అక్టోబర్ 28వ తేదీన బొగ్గు బాయి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

ఈ ఎన్నికల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాలపై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతంలో సింగరేణి బొగ్గు బావులు విస్తరించి ఉన్నాయి. తూర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు సుమారు 20వేల దాకా ఉంటారని అంచనా. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో శ్రీరాంపూర్, గోలేటి, మందమర్రి ఏరియాలు ఉన్నాయి. 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా.. 22 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. గుర్తింపు పొందిన కార్మికులు 16 వేలకు పైగా ఉండగా పరోక్ష, పొరుగు సేవలు కింద మరో 4000 దాకా కార్మికులు సింగరేణి లో పనిచేస్తున్నారు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలుపుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు లక్ష ఓటర్ల దాకా ఉంటారని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓటింగ్ అత్యంత కీలకంగా ఉంటుంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో గెలవడం రాజకీయ పార్టీలకు అత్యంత ఆవశ్యకతను కల్పిస్తోంది.

ప్రస్తుతం మూడు ఏరియాలకు సంబంధించి బెల్లంపల్లి శ్రీరాంపూర్ లలో అధికార బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారంలో ఉంది మందమర్రిలో మాత్రం సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ప్రాతినిధ్యం వహిస్తోంది. కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి సైతం భారీగా ఓటర్లను కలిగి ఉంది. అయితే ఐఎన్టీయూసీ గత ఎన్నికల్లో ఏ ఒక్క ఏరియాలోనూ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. ఓటర్ల రీత్యా టీబీజీకేఎస్ ఏఐటీయూసీతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. వచ్చే ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన 2, 222 కోట్ల రూపాయల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే 711 కోట్ల రూపాయలను ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్‌గా చెల్లించగా, ఈ సారి మరో రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు మంగళవారం రాష్ట్ర ఇంధన శాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి లక్షా 60 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల వరకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.