అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తనదైన మార్కు చూపుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీఎంవో నుంచి, గాంధీ భవన్ నుంచి లీకులు వస్తున్నాయి. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆగస్టు అంటే తెలుగు రాష్ట్రంలో సంక్షోభం గుర్తొస్తుందని, ముఖ్యంగా టీడీపీకి ఇది ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆగస్టు సంచలనం ఏమిటా అని అంతా ఆరా తీస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రారంభించిన పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. వాటిలో కొన్నింటిని ఆగస్టులో పక్కన పెట్టాలని రేవంత్ భావిస్తున్నారు. కొన్నింటి పేర్లు మారుస్తారని తెలుస్తోంది. కొన్ని కొత్త పథకాలు ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ఈమేరకు సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రైతుబంధును రైతుభరోసాగా, ఆసరా పెన్షన్‌ను చేయూతగా ఇలా మొత్తం 12 పాలసీలకు సంబంధించి మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం ప్రారంభించి నిధులు విడుదల చేయలేద. దీంతో కాంగ్రెస్ సర్కార్ దాని స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అనే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. తాజాగా టీఎస్ ఐపాస్ పాలసీలో విప్లవాత్మమైన మార్పులు తీసుకొచ్చారు. కేటీఆర్ గొప్పగా చెప్పుకున్న పాలసీని సైతం మార్చాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఒక్క పాలసీలో ఆరు పాలసీలు వస్తాయని ఆమేరకు విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.ఇక ఆగస్టులోనే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపైనా కమిటీ ఏర్పాట చేసే అవకాశం ఉంది. మండలాల్లోని గ్రామాలను కూడా సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదించేందుకు కమిటీ వేసి ఆ కమిటీ సూచనల మేరకు మార్పులు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.