జాతీయం ముఖ్యాంశాలు

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

4 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల వెంట సి.సి కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వ్యక్తి కదలికలు సి.సి కెమెరాలు రికార్డు చేస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవని, అలా కాదని నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్లు తీసుకువెళితే సీజ్ చేయడం జరుగుతుందని, మళ్ళీ ఇవ్వబడవని వివరించారు. జూన్ 4 నుండి కఠినమైన కర్ఫ్యూ అమలు చేయబడు తుందని, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదన్నారు.

జూన్ నెల 6 వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా బయటి వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు, పాత నేరస్థులకు ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ నెల 6 వ తేదీ వరకూ నిబంధనలు అమలులో ఉంటాయని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.