అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఆఫ్ఘనిస్థాన్‌లో మ‌ళ్లీ రెచ్చిపోతోన్న తాలిబ‌న్లు

అదును చూసి దాడులు జ‌రిపిన ఆఫ్ఘన్ సైన్యం
తాలిబ‌న్ల‌పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు.. 30 మంది హ‌తం.. 17 మందికి గాయాలు

అమెరికా ద‌ళాలు వెనక్కి వెళ్తుండ‌డంతో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్లు మ‌ళ్లీ రెచ్చిపోతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల‌ను త‌మ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇటీవ‌ల‌ అనేక ప్రాంతాల్లో తాలిబ‌న్ల‌కు ఆఫ్ఘన్ సైన్యం కూడా జంకింది. అయితే, తాలిబ‌న్ల చ‌ర్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తోన్న ఆఫ్ఘన్ దళాలు అదును చూసి ఒక్క‌సారిగా దాడి చేయ‌డంతో 30 మందికిపైగా తాలిబ‌న్లు హ‌త‌మ‌య్యారు. మ‌రో 17 మంది ఉగ్ర‌వాదులకు తీవ్ర‌గాయాల‌య్యాయి. తాలిబ‌న్ల‌పై వైమానిక దాడులు చేయ‌డంతో వారు హ‌త‌మ‌య్యార‌ని ఆఫ్ఘన్ అధికారులు ప్ర‌క‌టించారు. హ‌త‌మైన తాలిబ‌న్ల‌లో 19 మంది షిబెర్ఘాన్ శివారులోని ముర్ఘాబ్‌, హాస‌న్ తాబ్బిన్ గ్రామాల్లో జ‌రిపిన దాడుల్లో మ‌ర‌ణించార‌ని వివ‌రించారు.

అలాగే, మిగ‌తావారు లష్క‌ర్ ఘాహ్ శివారులో హ‌త‌మ‌య్యార‌ని చెప్పారు. వారిలో ఇద్ద‌రు ఆఫ్ఘనిస్థానేత‌ర ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని చెప్పారు. ఆ ప్రాంతాల్లోనే కొంద‌రికి గాయాల‌య్యాయని, వారిలోనూ ఇద్ద‌రు ఆఫ్ఘనిస్థానేత‌ర ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని తెలిపారు. ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల వాహ‌నాలు, రెండు బంక‌ర్లు, పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రిని ధ్వంసం చేశామ‌ని చెప్పారు. కాగా, తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు ఇప్ప‌టికే 419 జిల్లాలను త‌మ అధీనంలోకి తెచ్చుకున్నార‌ని వార్తలొస్తున్నాయి.