జాతీయం ముఖ్యాంశాలు

వాటిని కట్టడి చేయ‌డానికి బూస్ట‌ర్ డోసులు అవసరం

భ‌విష్య‌త్తులో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం: ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ గులేరియా

జ‌న్యు క్ర‌మంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ వ్యాప్తి చెందుతూ మాన‌వాళిని ముప్పుతిప్ప‌లు పెడుతోన్న క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి భ‌విష్య‌త్తులో బూస్టర్ వ్యాక్సిన్ డోసులు కూడా వేసుకోవాల్సిన‌ అవసరం రావ‌చ్చ‌ని ఎయిమ్స్‌ చీఫ్ డాక్ట‌ర్ రణదీప్‌ గులేరియా అన్నారు. భ‌విష్య‌త్తులో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయ‌డానికి ఈ చ‌ర్య తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందని, అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించుకోవాల‌ని తెలిపారు.

మన శ‌రీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతూ కరోనా వేరియంట్ల‌న్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన రెండో తరం వ్యాక్సిన్లు రాబోతున్నాయని చెప్పారు. ఈ బూస్టర్‌ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, డిసెంబ‌రులోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద‌ని తెలిపారు. అలాగే, సెప్టెంబరు చివరి నాటికి భార‌త్‌లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద‌ని ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. చిన్నారులపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌, జైడస్‌ క్యాడిలా సంస్థ‌కు చెందిన మ‌రో వ్యాక్సిన్ ఈ ఏడాది చివ‌రినాటికి చిన్నారుల‌కు అందుబాటులోకి రావ‌చ్చ‌ని తెలిపారు.