ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పవర్ స్ట్రోమ్

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విజయం దూసుకెళుతున్నారు. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఇప్పటికే సుమారు 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే పవన్ కు భారీ మెజారిటీ దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా పవన్ ఇప్పుడు భారీ మెజారిటీతో దూసుకెళుతుండడంతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక ఎన్నికల్లో పవన్ సపోర్టు ఇచ్చిన టీడీపీ కూటమి కూడా 160కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పవన్ కల్యాణ్, కూటమికి సపోర్టు చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.

తాజాగా జనసేన అధిపతి పవన్ కల్యాణకు మద్దతుగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. పవన్ తో తాను తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా’లోని ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’ అని పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీరితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు, నటీనటులు, టెక్నీషియన్లు పవన్ కు ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సాయి ధరమ్ తేజ్ కూడా పవన్  ఆధిక్యంపై స్పందించారు. ‘పవర్ స్ట్రోమ్.. ప్రస్తుతం, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ చేతిలో  ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ గా ఉంటుందని ట్వీట్ చేశారు.