ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియగా.. ఈ కేసులో కవిత్ర పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. జూన్ 21 వరకూ కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.సీబీఐ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కాగా.. తనకు జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరగా.. అందుకు అంగీకరించింది. కవిత చదువుకునేందుకు కావాలని కోరిన 9 పుస్తకాలను అందించాలని జైలు అధికారులకు సూచించింది.మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3 వరకూ ఉంది. రిమాండ్ లో ఉన్న కవితను.. ఈడీ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. అధికారులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసులో జులై 3వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి.. తీహార్ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువులు పలుమార్లు పెరుగుతూ వచ్చాయి. కవిత తర్వాత అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పొందడం.. ఆ గడువు తీరడం కూడా జరిగిపోయాయి. కవితకు మాత్రం ఇంతవరకూ బెయిల్ మంజూరు కాలేదు.