మొన్నటి ఎన్నికల ఫలితాల్లో YSRCP ఘోరమైన ఫలితాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలుసు. జనమే జగన్.. జగనే జనం .. ఎక్కడ చూసినా ఈ స్థాయి ఎలివేషన్లే. కానీ లాస్ట్ ఐదేళ్లలో ఆయన జనంలో ఉన్నాడా.. ? లేడు. సిద్ధం చివర్లో చేసిన యుద్ధం తప్ప.. కనీసం కాలు కింద పెట్టి నడిచింది లేదు. తాడేపల్లి దాటి వచ్చింది లేదు. సరే ఆయన లేడు.. జనంతో కలిసి ఉన్నవాళ్లు ఎవరు ఆయనతో ఉన్నారు.. ఏ ప్రజాప్రతినిధితో అయినా నేరుగా మాట్లాడారా… గ్రౌండ్‌లో సిచ్యువేషన్ తెలుసుకున్నారా.. ఇవన్నీ చేయకుండా జనాలతో కనెక్షన్ లేకుండా నా వెంట జనం ఉన్నారనే హెల్యూజినేషన్ లో ఉండిపోయారు. ఆ పరిస్థితి ఎందుకంటే..2019లో ఆ స్థాయిలో గెలుపు ఉంటుందని బహుశా అప్పటికి వైఎస్సార్పీపీ అనుకుని ఉండదు. ఈ సారి ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని ఊహించి ఉండరు. అందుకే దీనిని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి.
2019 ఎన్నికలకు ముందు మనకు ప్రత్యేక హోదా.. రాలేదా… మన పోలవరం కంప్లీట్ అవ్వలేదా.. అయ్యయ్యో.. అన్నట్లుగా అభినయించి మరీ ఆయనో ఇంటర్వూ ఇచ్చారు. ఇప్పుడు అదే టోన్ ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయా.. కోటి కుటుంబాలకు డబ్బులిచ్చామా అయినా ఓట్లేయలేదా అయ్యయ్యో అనుకోవాలి మరి.. మొన్న వైసీపీ అధినేత పావుగంట ప్రెస్‌మీట్ చూస్తే అలాగే అనిపించింది. ఇంత మందికి అంత చేస్తే.. ఎందుకు పోయింది అని జగన్ ..నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యంలో కూడా నిజం ఉంది. ఎందుకంటే ఫలితాలు వచ్చే వరకూ తాను ఓడిపోతానని జగన్ అనుకోలేదు. ఇంత దారుణ ఓటమి కాదు మామూలుగా కూడా ఓడను.. తనకు 150 వస్తాయి అనే అనుకున్నారు. ఎందుకో చెప్తాను చూడండి. జగన్ కు ముక్కు.. చెవులు… నోరు అని ముగ్గురుంటారు… రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్మెల్ చూసి చెప్పడానికి సుబ్బారెడ్డి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వినడానికి విజయసాయిరెడ్డి, తాను అనుకుంది.. లీడర్లకు చేరవేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముక్కు, చెవులు, నోరు రోల్స్ వీళ్లవి. సరే వీళ్లలో ఎవరైనా ప్రజా నాయకులా.. ఎలక్షన్‌లో గెలిచారా.. ఎక్కడా గెలవని వీళ్లు చెబితే భారీ మెజార్టీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు వినాల్సిన పరిస్థితి.
ఇక వీళ్లు కాకుండా చెవిరెడ్డి, మిధున్ రెడ్డి అనే ఫీడ్‌బ్యాక్ టీమ్. వీళ్లు జగన్ కు ఏం జరుగుతుందో చెప్తారు. కానీ అంతకంటే ముందే ఆ ఫీడ్‌బ్యాక్ కు ఓ ఫిల్టర్ పడుతుంది. అది ఎవ్వరూ అన్నది ఇక్కడ చెప్పలేం కానీ ఆ ఫిల్టర్ లోనుంచి వెళ్లిన ఇన్ ఫర్మేషన్ మాత్రమే జగన్ కు చేరుతుంది. దాన్నే ఆయన నమ్మారు. ఇక రెండో వింగ్ ఐపాక్. వీళ్లను కూడా జగన్ బాగానే నమ్మారు అనుకోవాలి. 2019లో కులాల వారీగా లెక్కలతో ఎక్కడెక్కడ ఎవరూ ఇన్ ఫ్లుయెన్సల్ అని చెప్పి.. మీతో సీట్లు ఇప్పించారు . అవి వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడూ అదే అంటే.. కుదరదుగా.. నాయకుడికి సొంతంగా విశ్లేషించుకునే సామర్థ్యం ఉండాలి. పరిపాలనలో అయినా .. రాజకీయంలో అయినా లాజికల్, టాక్టికల్, ప్రాక్టికల్ మూడు విధానాలుంటాయి. మీ మీద, మీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను.. తగ్గించడానికి అభ్యర్థులను మార్చండి అని Ipac చెబితే 90 మందిని మార్చేశారు. వ్యతిరేకత మీ మీద ఉంటే.. ఎమ్మెల్యేలను మారిస్తే.. వ్యతిరేకత ఎలా పోతుంది…? ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు మీరు…? ఓ పక్క మిమ్నల్ని చూసి ఓటేయండి అన్నారు.
ఇంకో పక్క ఎమ్మెల్యేలను మార్చేశారు. అర్థం ఉందా ఇందులో…? టాక్టికల్ గా కులాల ప్రకారం సీట్లు ఇస్తే.. గెలిచేస్తామనే మీ లెక్క కూడా తప్పు. ఆ కులాలకు మీ దగ్గర సరైన ప్రాధాన్యం ఉంటే ఓట్లేస్తారు. అంతే కానీ బొమ్మలుగా నిలబెడితే కాదు కదా.. మీ పార్టీలో వేరే కులం నాయకులకు ఎక్కడైనా ప్రాధాన్యం ఉందా.. పార్లమెంటరీ పార్టీ, లోక్ సభ ఫ్లోర్ లీడర్, పార్టీలో టాప్ లీడర్లు అంతా ఎవ్వరు.. మరి పెత్తనం లేకుండా పదవి ఇస్తే ఓట్లు వేసేంత అమాయకులా జనం…చివరది ప్రాక్టికాలిటీ. కోటి కుటుంబాలకు పథకాలు ఇచ్చాను కాబట్టి ఇంటి మూడు ఓట్లు చొప్పన ౩ కోట్లు ఓట్లు నాకే వేస్తారు అనుకోవడం అమాయకత్వం కదా.. జగన్ రెడ్డి గారూ..!? అలా అనుకోవడమే కాదు.. పైగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. ఇలా చేశారు ఏంటి అని.. కోటి కుటుంబాల లెక్క చెప్తా చూడండి. కోటి కుటుంబాల్లో మీ పార్టీవి సగం.. అవతలి వాళ్లవి సగం ఉంటాయి. లేదా మీవి 60 లక్షలు ఉంటే వాళ్లవి 40 లక్షలు ఉన్నాయి. మీరు ఏం చేసినా ఈ 40 లక్షలను మీ వైపు తీసుకురాలేరు.
ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా ఎన్ని పథకాలు ఇచ్చినా మీకు ఓట్లు వేసే కుటుంబాలను వాళ్ల వైపు తీసుకెళ్లలేరు. ఓడిపోయినా కూడా మీకు 40శాతం ఓట్లు వచ్చినట్లే.. తెలుగుదేశానికి కూడా 2019లో 40శాతం వచ్చాయి. అవి అంత తేలిగ్గా మారవ్. ముఖ్యంగా తెలుగుదేశం ఓట్లు అస్సలు మారవు. ఇంకా చెప్పాలంటే ఓ పార్టీగా.. తెలుగుదేశం వైఎస్సార్సీపీ కన్నా పెద్దది. ఈ దేశంలో అత్యధిక మంది కార్యకర్తల బలం ఉన్న ప్రాంతీయ పార్టీ అది. ప్రతి ఊరిలో పార్టీలు, వర్గాలుగా విడిపోయిన చోట మనం ఇన్ ఫ్లూయెన్స్ చేయలేరు. చిన్న గ్రామాల్లో అయితే వందల్లో, చిన్న పట్టణాల్లో వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ విషయం తెలియడమే ప్రాక్టికాలిటీ. దీనిని మీ పక్కనున్న వాళ్లు చెప్పలేదా.. కోటి మందికి ఇచ్చాం కాబట్టి కనీసం 70శాతం ఓట్లు వేస్తారనే హెల్యూజినేషన్ లోనే మిమ్నల్ని ఉంచారా… లేక మీరే ఉన్నారా… ఎప్పుడైనా అధికారాన్ని డిసైడ్ చేసేది.. పార్టీ ఓటర్లు కాదు.
మీరు చెప్పిన కోటి కుటుంబాలే కాకుండా ఇంకో 20లక్షల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏ పార్టీకి చెందని.. రాష్ట్రంలో ఏం జరిగిందో చూసి.. ఓట్లు వేద్దామనుకునే వాళ్లు ఉంటారు. వాళ్లు మాత్రమే డిసైడ్ చేస్తారు. 2019లో మీకైనా.. 2024లో కూటమికైనా ఓట్లేసింది వాళ్లే… ఇవే కాదు.. అసలు మీరు సరిగ్గా తెలుసుకుంటే చాలా విషయాలు తెలిసేవి.. కార్యకర్తలకు టైమ్ ఇవ్వడం లేదని,.. కనీసం నాయకులకు అపాయింట్మెంట్లు లేవనే ఆవేదన మీ చెవులకు వినిపించలేదా. రాష్ట్రంలో ఏకపక్షంగా జరుగుతున్న వ్యవహారాలపై, పోలీసులు బిహేవ్ చేసిన తీరుపై జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కు ఏ గతి పట్టిందన్న దానిపై.. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే.. పార్టీ అతన్ని ఎలా ట్రీట్ చేసిందన్న దానిపై, దళిత యువకుడికి పోలీసులే గుండు కొట్టడంపై.. చంద్రబాబు ర్యాలీలపై రాళ్లు వేయడంపై,.. పవన్ కల్యాన్ పై నోటికొచ్చినట్లు పేట్రేగిపోవడంపై.. ప్రజా ప్రతినిధులను కొట్టడంపై… ఈ అప్పులు రాష్ట్రాన్నే కొంప ముంచుతాయేమో అన్న భయాలపై, ప్రభుత్వ ఉద్యోగులను చులకన చూడటంపై.. టీచర్లను.. అంగన్వా డీలను అడ్డుకోవడంపై.. అడ్డంగా అమ్ముతున్న మీ బినామీల మద్యంపై, నిజంగానే స్మశానంలా మార్చిన అమరావతిపై, ఆ రైతుల కన్నీళ్లపై.., లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై, మనుషులందరూ అసహ్యించుకునే మీ మంత్రుల మాటలపై, మీ ఇంట్లో జరిగిన హత్యపై.. దానిని మీరు కవర్ చేస్తున్నారనే ఓ చర్చపై, అభిప్రాయంపై.. సొంత కుటుంబాన్నే దూరం చేయడంపై….ఇలా చెప్పుకుంటా పోతే.. చాంతాడంత లిస్టు ఉంది. వీటన్నింటిపైనా చర్చ జరిగింది.
కానీ వాటిని మీ సొంత చెవులు, కళ్లు ద్వారా పరిశీలిస్తే తెలిసేది. వేరే వాళ్లపై ఆధారపడితే.. మొన్న ప్రెస్‌మీట్‌లో ఆశ్చర్యపోయినట్లే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఫైనల్‌గా అన్నింటికంటే అసలు కారణం తెలుసా.. ఎవ్వరికీ సమాధానం చెప్పని .. ఎవ్వరి మాటా వినని మీ ధోరణిపై కూడా ప్రజలు తీర్పిచ్చారు. ఎక్కడైతే.. ప్రజల గురించి కామెంట్ చేసి.. దాని గురించి అడిగే అవకాశం ప్రెస్‌లో ఎవరికీ ఇవ్వకుండా లేచి వెళ్లిపోయారు చూశారా.. ఆ ధోరణిపైనే ప్రజలు సమాధానం ఇచ్చారు. నేను ఇచ్చాను మీరు నాకు ఓట్లేయాలి.. నేను ప్రభువును మీరు నాకు రుణపడి ఉన్నారు అనే మాటలపైనే తీర్పిచ్చారు. అదే ప్రెస్ మీట్‌లో ఆగి ఇంకో పది నిమిషాలు ఫేస్ చేసి ఉంటే.. మీకు ఎందుకు ఓట్లేయలేదో అక్కడే తెలిసేది. సరే.. జరిగింది మార్చలేరు జగన్ గారు.. కనీసం ఇప్పటికైనా మీ ధోరణి అయినా మార్చండి. సొంతంగా పార్టీ పెట్టి.. స్వయంగా సీఎంగా ఎదిగిన నేత మీరు.
కేంద్ర స్థాయిలో ఉన్న అణచివేతలను ఎదుర్కొన్న ఫైటర్ . 2014 ఓటమిని కూడా ఇలాగే ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. చంద్రబాబు కూడా మూడుసార్లు ఓడిపోయారు. మళ్లీ లేచారు. మీకూ చాన్స్ వస్తుంది. అందుకు ఏం చేయాలో చూడండి. జనాలని నిందిస్తే.. మాత్రం ఫలితం ఉండదు.