తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. స్వరాష్ట్ర సాధన కోసం 24 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ.. లక్ష్యాన్ని చేరుకుంది. పార్టీ అధినేత సకల జనులను ఏకం చేసి స్వరాష్ట్ర ఉద్యమం సాగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారు. 2014లో స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యమ నేతగా గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అక్కడి నుంచి గులాబీ నేతల్లో స్వార్థం మొదలైంది. తెలంగాణ ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అయినా 2018 ముందస్తు ఎన్నికల్లోనూ మరోమారు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ అహంకారం తలకెక్కింది. దీంతో ఆ పార్టీకి మరో మారు అవకాశం ఇవ్వొద్దని యావత్ తెలంగాణ నిర్ణ యించుకుంది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ క్యాడర్ ఈ ఓటమితో కుంగిపోయింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ఓటమిపై సమీక్ష చేయలేదు. వైఫల్యాలను గుర్తించలేదు.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని అదే అహంకారం ప్రదర్శించారు. ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. కానీ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయలేదు. ఉత్సాహం నింపే ప్రయత్నం చేయలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది పార్టీని వీడారు. మిగతా వారు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. దాదాపు 17 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది.అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే కేటీఆర్‌పై ఒత్తిడి పెరిగింది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని మరోకరికి బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని సమీక్షలు పెడితే చెప్పాలని భావించింది. కానీ కేటీఆర్ సమీక్షలు చేయలేదు. ఓటమిని పట్టించు కోలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరింత దారుణంగా వచ్చాయి. దీంతో కేటీఆర్‌పై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా కేటీఆర్ తమతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదన్న అసంతృప్తి బీఆర్ఎస్ క్యాడర్‌లో తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తోంది.
కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి, ఒంటెత్తు పోకడలే ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరాభవం చవి చూసిందని పేర్కొంటున్నారు. ఇకనైనా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. రాజీనామాపై ఒత్తిడి పెరుగుతుండటంతో కేటీఆర్ రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నేతల ఒత్తిడితో తప్పుకుంటే.. పార్టీపై కేటీఆర్‌కు పట్టు సడలుతుంది. అలా కాదని పదవిలో కొనసాగితే తప్పుకోవాలన్న డిమండ్లు మరింత పెరుగుతాయి. అసంతృప్తులు పార్టీ వీడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో కేటీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.