ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిరూ పవర్ చూపించిన పవన్

గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన సాగించారు జగన్. 151 సీట్లతో గెలిచేసరికి విజయ గర్వంతో ఊగిపోయారు. తన ప్రతి నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తారని భావించారు. తన మాటకు ఎదురు తిరగరని అంచనా వేశారు. అమరావతి ఏకైక రాజధానికి అందరూ ఆమోదముద్ర వేస్తే.. తాను మాత్రం మూడు రాజధానులు అంటూ విభిన్నంగా ఆలోచించారు. అందుకే 166 నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అమరావతికి జై కొట్టారు. మూడు రాజధానులు వద్దు అంటూ తేల్చి చెప్పారు. చివరకు రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర ప్రజల సైతం తిరస్కరించారు. విశాఖ నగరవాసులు కనీసం ఆహ్వానించలేదు. పైగా భారీ ఓటమితో బదులు చెప్పారు. అధికారంలో ఉండగా అన్ని అనుకూలతలు కనిపిస్తాయి. ప్రధాని మోదీ ఆహ్వానిస్తారు. అవకాశం ఇచ్చారు.

కూర్చోబెట్టి చర్చించారు. చాలా రకాల మినహాయింపులు ఇచ్చారు. అది ఒక దేశ పాలకుడిగా.. ప్రతి రాష్ట్ర పాలకుడికి ఇచ్చే మినహాయింపు. కానీ తనకు రాష్ట్రంలో తిరుగులేదు.. జాతీయస్థాయిలో ఎదురు లేదు అన్నట్టు భావించారు. కానీ అన్నింటికీ సమాధానం ఇచ్చారు ఏపీ ప్రజలు. పవన్ అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా జగన్కు దీటైన బదులిచ్చారు. అటు పదేళ్ల అభిమానుల నిరీక్షణకు అసలుసిసలు ఫలితం ఇచ్చారు.అదే సమయంలో చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అదే చిరంజీవిని జగన్ అవమానించిన తీరుకు గట్టిగానే బదులిచ్చారు పవన్. చంద్రబాబు తో పాటు పవన్ ను ఆశీర్వదించారు ప్రధాని మోదీ. వారికి శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలోనే తన అన్న చిరంజీవి ప్రస్తావని తీసుకొచ్చారు పవన్. మోడీ సైతం ఒక వైపు పవన్ ను, మరోవైపు చిరంజీవిని పక్కన పెట్టుకుని కూటమి విజయ గర్వాన్ని అనుభవించారు. చిరంజీవి స్థాయి ఏమిటో, ఆయన స్థానం ఎక్కడుందో తెలిసి వచ్చేలా చేశారు పవన్. నలుగురు మధ్య చిరంజీవికి చేసిన అవమానాన్ని.. కోట్లాదిమంది సాక్షిగా బదులిచ్చారు పవన్.

సినీ పరిశ్రమ సమస్యలపై పెద్దన్న పాత్ర పోషిస్తూ చిరంజీవి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. నాడు అధికార మదంతో జగన్ వ్యవహరించిన తీరు, అదృశ్య కెమెరాల్లో బంధించి మరి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో లక్షలాదిమంది మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. అందుకే ఇప్పుడు పవన్ రివెంజ్ తీర్చుకున్నారు. అటు కుటుంబ విలువలను సైతం జగన్ కు తెలియజెప్పారు పవన్. ఓటమితో కష్టంలో ఉన్నప్పుడు అవమానాలను తాను ఒక్కడినే భరించాడు పవన్. కానీతనకు దక్కిన విజయం,గౌరవంలో మాత్రం అన్న చిరంజీవికి వాటా ఇచ్చాడు. అసలు కుటుంబ విలువలు అంటే ఇవి కదా జగన్ అని సోషల్ మీడియాలో ప్రశ్నలు, నిలదీతలు ఎదురయ్యేలా చేశాడు పవన్.
అన్నదమ్ముల అనుబంధం
అయితే ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పులకించుకుపోయిన చిరంజీవి.. తమ్ముడి బుగ్గలను నిమురుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతే ఆనందంతో ప్రధాని మోదీ కనిపించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా ఊహించుకొనగా.. మెగాస్టార్ చిరంజీవి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆ సమయంలో ఏమన్నారోసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నాతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు ఆ వీడియోలో కనిపించాయని అన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని, కుటుంబ విలువలను ప్రతిబింబించాయని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి అన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు.

తమ్ముడి స్వాగతం లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం’అంటూ చిరంజీవి పేర్కొన్నారు.ప్రధాని మోదీతో చిరంజీవి క్లోజ్ గా గడపడం ఇదే కొత్త కాదు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి సైతం ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పుడు సీఎం గా జగన్ ఉన్నారు. ఆయన సైతం అదే వేదికపై ఉన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం చిరంజీవితోనే చనువుగా గడిపారు. ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ విషయంలో సైతం చనువుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సోదరులు ఇద్దరు ఒకే వేదికపై ఉండడం, ఆనందోత్సవాలు జరుపుకోవడం చూసి ప్రధాని మోదీ పరవశించిపోయారు. ఆ ఇద్దరు సోదరులతో ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.