సహకార డెయిరీలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో జగన్ సర్కార్ పాలవెల్లువ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. పాడి రైతుల నుంచి పాల సేకరణ చేపట్టింది. ఈ బాధ్యతలను అమూల్ కంపెనీకి అప్పగించింది. పాడి రైతుల సంఘాలు ఏర్పాటు చేసి వారి పేరున బ్యాంక్ ఖాతాలను తెరిపించారు. సహకార బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్భాటంగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయలేదు. హెరిటేజ్, తిరుమల, విశాఖ డెయిరీ వంటి సహకార సంస్థలను దెబ్బ తీయాలని వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇతర డెయిరీలు పాలు పోసే రైతుల పిల్లలకు విద్య, వారి కుటుంబాలకు వైద్యం, పాడి పశువులకు దానాను రాయితీపై అందిస్తున్నాయి. పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. అమూల్ సంస్థ ఇవేవీ అమలు చేయలేదు. అందుకే పాలు పోసే రైతుల సంఖ్య తగ్గి పోయింది. ఫలితంగా కేంద్రాలు మూతపడ్డాయి.అనకాపల్లి జిల్లాలో పాల సేకరణ అధికం. పాడి రైతులకు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ జిల్లా వ్యాప్తంగా 305 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కానీ అందులో 55 కేంద్రాలు మూతపడ్డాయి. పాలు పోయడానికి రైతులు ముందుకు రాకపోవడంతో మరో 29 కేంద్రాలు తలుపులే తెరుచుకోలేదు. గతంలో రోజుకు 50 వేల లీటర్లు పాలు రాగా.. ప్రస్తుతం 37,600 లీటర్లు మాత్రమే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పైగా కేంద్రాలను పంచాయితీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితేభారాన్ని తాము మోస్తున్నట్లు అమూల్ చెబుతుండగా.. సర్పంచులు మాత్రం తమపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల విద్యుత్ చార్జీల బిల్లులు కూడా పెండింగ్లో ఉండిపోయాయని చెబుతున్నారు.సహకార రంగంలో ఉన్న విశాఖ, హెరిటేజ్, తిరుమల వంటి డెయిరీలు రైతులకు ఎన్నో రకాల ప్రోత్సాహాకాలు అందించేవి. పాల సేకరణ పెంపొందించుకునేందుకుగాను బోనస్ లు, ఇతరత్రా రాయితీలు ప్రకటించేవి. పాడి రైతుల కుటుంబాల్లో చదువు, ఆరోగ్యం, వివాహాలకు ప్రోత్సాహం వంటి వాటిని అందిస్తూ వచ్చేవి. అయితే హెరిటేజ్ సంస్థ పై ఉన్న కోపంతో జగన్ సర్కార్ పాలవెల్లువను తెరపైకి తెచ్చింది. అమూల్ కు ఈ బాధ్యతను అప్పగించింది. కానీ నిర్వహణలో మాత్రం పూర్తిగా విఫలమైంది.
కేవలం కొందరు పెద్దల జేబు నింపేందుకే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు సర్కార్ అమూల్ తో ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.అయితే ఈసారి ఏపీలో హెరిటేజ్ హవా ప్రారంభమవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులదే హెరిటేజ్ అన్న సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే హెరిటేజ్ లాభాలు గణనీయంగా పెరిగాయి. జగన్ సర్కార్ తమను దెబ్బతీయడానికి అమూల్ సంస్థను తెరపైకి తెచ్చింది. కానీ అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరం కావడంతో అమూల్ కేంద్రాలు మూతపడనున్నాయి. దీంతో హెరిటేజ్ హవా ఒక రేంజ్ లో కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హెరిటేజ్ కోసమే ఎన్నో సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారన్న విమర్శ చంద్రబాబుపై ఉంది. మరోసారి అటువంటి ప్రయత్నమే జరుగుతుందని విపక్షాలు సైతం అనుమానించడం ప్రారంభించాయి.