ఆంధ్రప్రదేశ్ జాతీయం

Karnataka Milk: బకాయిలు చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు పాల సరఫరా: కేఎంఎఫ్‌

(Karnataka Milk) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రూ.130కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్‌వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్య ‌(కేఎంఎఫ్‌) సోమవారం స్పష్టం చేసింది. ఇకపై పాల ధరను లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు కూడా వెల్లడించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ లేఖ రాసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలకు పాల అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జూన్‌లో కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. సంపూర్ణ పోషణ పథకం కింద చిన్నారులకు పాలు అందిస్తున్నారు. ఈ కారణంతోనే లీటర్‌ ధరపై రూ.5 తగ్గించేందుకు కేఎంఎఫ్‌ గతంలో అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలా 110 లక్షల లీటర్ల పాలను కేఎంఎఫ్‌ నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. అయితే నాలుగు నెలలుగా కేఎంఎఫ్‌కు ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. బకాయి మొత్తం రూ.130 కోట్లు చెల్లించాలని పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఏపీ సర్కారు నుంచి స్పందన రాలేదని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో కేఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీసీ సతీశ్‌ తెలిపారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వానికిచ్చే రూ.5 సబ్సీడీ కూడా తొలగిస్తామని లేఖలో పేర్కొన్నారు.