ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులకు నోటీసులు

స్థలం కేటాయించకపోయినా తాడేపల్లిలో వైసీపీ  కట్టేస్తున్న కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో నిర్మించిన వైసీపీ ఆఫీసులకు కూడా అనుమతులు లేవన్న విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖలో అత్యంత అధునాతన హంగులతో నిర్మించిన పార్టీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తేలడంతో మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఒక్క విశాఖ ఆఫీసు మాత్రమే కాదు.. పలు జిల్లాల్లో నిర్మించిన ఆఫీసులకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. అనకాపల్లిలో నిర్మించిన కార్యాలయానికీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉ  కార్యాలయం నిర్మించారు. అక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఏడాది క్రితం ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేశామని ఇంకా పెండింగ్ లో ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.  

వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టం చేశారు. నెల్లూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. వాటన్నింటికీ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.  కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ..బిల్డింగ్‌కు అన్ని అనుమతులు తీసుకున్నామని రెండు రోజులు సమయం ఇస్తే చూపిస్తామన్నారు. దీంతో నోటీసులు జారీ చేశారు.  తాము అన్ని పర్మిషన్లు తీసుకున్నామని అధికారులకు అందచేస్తామని వైసీపీ నేతలంటున్నారు. వైసీపీ ఆఫీసులు కడుతున్న భూములన్నీ ప్రభుత్వానికి చెందినవే. ఖరీదైన స్థలాలను, కాపు కార్పొరేషన్, మత్స్యకారులు, ఆర్టీసీకి చెందిన స్థలాలను ఏడాదికి ఎకరానికి వెయ్యికి లీజుకు కేటాయింప చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.  కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో   వైసీసీ కార్యాలయం నిర్మించారు.  

ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. పురసాలక సంఘం పాలక మండలి అనుమతితో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి పురపాలక సంఘానికి అధికారం లేదు. పైగా 99 తొమ్మిదేళ్లు లీజుకు ఇస్తూ పురపాలక సంఘం పాలక మండలి ఆమోదం తెలనటం అభ్యంతరకరమని అప్పట్లో టీడీపీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని వైసీపీ స్వాధీనం చేసుకుంది. ఇదే స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వస్తే భూమి ఇవ్వలేదు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. కానీ బాలశౌరిపై వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ స్థితిలో బందరు పోలీసు పేరేడ్ గ్రౌండ్ లో వెలిసిన వైసీపీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.

ఎన్టీఆర్   హయాంలో పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం క్వార్టర్స్ నిర్మించారు. ఇవ్వన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుత స్థలంలో పోలీసుల క్వార్టర్స్ కట్టకపోతే పోనీ… కనీసం ఈ మైదానంపై వచ్చే ఆదాయంతో పోలీసు శాఖకు సంక్షేమ నిధికి ఊరట లభించేదని.. పార్టీ ఆపీసుకు రాసేసుకోవడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.