వర్షాల కారణంగా ప్రజలు, రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. కరోనా పరిస్థితుల వల్ల గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పారు.
దీనికి సమాధానంగా… మహమ్మారి ఇబ్బంది పెట్టినా నన్ను నమ్మి ప్రజలు పూజలు చేశారని అన్నారు. వర్షాల కారణంగా ప్రజలు, రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారని, నేను మీ వెంట ఉండి నడిపిస్తానని చెప్పారు. అమ్మకి ఎంతో చేసినా ఏమీ ఒరగలేదని అనొద్దని… ప్రతి ఒక్కరినీ తాను కాపాడుకుంటానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.
కాగా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.