అంతర్జాతీయం

అమెరికాలో  ఆంధ్రులు…12.30 లక్షలు

అమెరికాకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఆసక్తి చూపిస్తున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం వారు అమెరికా వెంట పరుగులు పెడుతున్నారు. ఫలితంగా అమెరికాలో తెలుగు భాషకు ఓ పత్యేకమైన స్థానం ఏర్పడుతోంది. అమెరికా  ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో తెలుగు పాపులర్ లాంగ్వేజస్‌లో ఒకటి. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్లూ నివసించే అమెరికాలో అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటిగా మారింది. అమెరికాలో పాపులర్ లాంగ్వేజెస్‌లో పదకొండో స్థానంలో తెలుగు ఉంది. మొత్తం అమెరికాలో 350 భాషల్ని గుర్తించారు. అమెరికాకు తెలుగు ప్రజల వలస ఎక్కువగా ఉంటోంది. యూఎస్ సెన్సెస్ బ్యూరో డాటా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 12 లక్షల 30 వేల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. నిజానికి వీరి సంఖ్య ఏడేళ్ల క్రితం అంటే 2016లో కేవలం 3.2 లక్షలు మాత్రమే. ఏడేళ్లలో ఈ సంఖ్య పన్నెండు లక్షలు దాటిపోయింది. తెలుగు ప్రజలు అత్యధికంగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

ఆ రాష్ట్రంలో రెండు లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలుంటారు.తర్వాత టెక్సాస్ లో లక్షన్నర మంది, న్యూజెర్సీలో లక్షా పదివేల మంది , ఇలినాయస్ లో 83 వేలు,  విర్జీనియాలో 78 వేలు, జార్జియాలో 52 వేల మంది ఉంటున్నారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. వచ్చిన వారిలో 75 శాతం మంది అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. డాలస్ నగరంలో ఎక్కడ చూసినా ఇండియన్స్ ముఖ్యంగా తెలుగువాళ్లే కనిపిస్తారు. అక్కడ ఉంటే సొంత రాష్ట్రంలోనే ఉన్నట్లుగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. భారత్ నుంచి వస్తున్న విద్యార్థుల్లో అత్యధిక మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమాలకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు ఓ మంచి సినిమా యాభై కోట్ల వసూలు చేస్తోంది అంటే అక్కడ తెలుగు ప్రజలు ఎంత ఎక్కువగా పాతుకుపోయారో అర్థమవుతుంది.

చదువుకునేందుకు వచ్చే వారు… తమ కంపెనీల తరపున ప్రాజెక్టుల కోసం వచ్చే వారు.. మళ్లీ తిరిగి ఇండియాకు వెళ్లాలనుకోవడం లేదు. అక్కడే స్థిరపడిపోతున్నారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న వారు కూడా.. అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకే తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇటీవలి కాలంలో.. అక్కడ స్థిరపడిన వారు కొంత మంది .. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే వీరి సంఖ్య చాలా స్వల్పం