తెలంగాణ రాజకీయం

సరిహద్దులో భారీగా నిఘా..

మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో సరిహద్దు రాష్ట్రాల్లో నిఘా పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మహారాష్ట్ర ఎన్నికల కారణంగా మంగళవారం యావత్ మాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయంలో బార్డర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలంతో పాటు ఈ సమావేశంలో మహరాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా కలెక్టర్ పంకజ్ ఆశీయ, జిల్లా ఎస్పీ కుమార్ చింతా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న పోలింగ్ స్టేషన్ ల వివరాలు, సిబ్బంది ఏర్పాటు తదితర వివరాలపై చర్చించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీసుల పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆదిలాబాద్ ఎస్పీ గౌల్ ఆలం తెలియజేశారు. ఇదివరకే జిల్లాలో ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వివరాలు
1) బేల – శంకర్ గూడ,
2) జైనథ్ – అనంద్ పూర్,
3) జైనథ్ – పిప్పర్ వాడ,
4) బోథ్ – ఘన్ పూర్,
5) తలమడుగు – లక్ష్మీపూర్,
6) బీంపూర్ – కరంజి,
7) గదిగూడ – మెడీగూడ.
మహారాష్ట్ర సరిహద్దుతో ఎలాంటి డబ్బు మద్యం ఇతరాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే బహుమతులను రవాణా చేయకుండా తనిఖీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, జైనథ్ ఎస్ఐ పురుషోత్తం పాల్గొన్నారు.మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రకు సంబంధించిన షెడ్యూల్‌ పరిశీలిస్తే.. అక్టోబర్ 29 వరకు అభ్యర్థులు నామినేషన్ వేయవచ్చు. నవంబర్‌ 20న ఎన్నికలు ఒకే దశలో నిర్వహించి, నవంబర్ 23న ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ఫలితాలు ప్రకటించనుంది