2018 తెలంగాణ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్‌ఎస్ పార్టీలో ఎలా చేరారో.. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో అలాగే చేరుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా తమ పార్టీలో చేరనున్నారని చెబుతోన్న కాంగ్రెస్.. విలీనానికి అవసరమైనంత మంది సభ్యులు వచ్చేవరకూ ఇది కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరుకోగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్‌నే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కిందస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో రెండు వారాల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనమవుతుందని, మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు చేరుతారని, 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్వీ విలీనం తథ్యమని దానం అన్నారు. బీఆర్ఎస్ హాయంలో జరిగిన అక్రమాలు.. కేటీఆర్, ఆయన స్నేహితుల బండారాలను బయటపెడతామని హెచ్చరించారు. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకు, రాజేవ్ లాంటి వాళ్లు ఎన్ని వందల కోట్లు సంపాదించారని, ఆ లెక్కలన్నీ తేలుస్తామని దానం నాగేందర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ఇక, శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శనివారం నాడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే, ఒకటి రెండు రోజుల్లో గ్రేటర్‌లోని మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో కాంగ్రెస్ నేతల చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. ఈనెల 24న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్‌కు చెందిన మొత్తం 26 మంది కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, ఎవరూ పార్టీని వీడొద్దని ఆయన భరోసా ఇస్తున్నా.. కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి.