తెలంగాణ

ఆక్రమాణలకు అడ్డగా...కాకతీయ చెరువులు

వరంగల్, జూలై 29: ఆక్రమణలతో కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు తెగిపోయాయి. అక్రమ నిర్మాణాలతో నాలాలు కుచించుకుపోయాయి. దీంతో వర్షాలు పడిన ప్రతిసారి నగరంలోని కాలనీలు చాలావరకు నీళ్లలో మునుగుతున్నాయి. 2020 తరువాత 2021, 2022, 2023లో కురిసిన వర్షాలకు కూడా నగరంలో వరదలు ముంచెత్తాయి. వరద ముంపునకు కారణమైన ఆక్రమణల విషయంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కొంత హడావుడి చేసి ఆక్రమణలు అరికట్టకుండానే చేతులెత్తేసింది. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ నయీంనగర్ వద్ద ఇతర పార్టీకి చెందిన ఓ వ్యక్తి స్కూల్ బిల్డింగ్ అడ్డుగా ఉందని అప్పటికప్పుడు కూల్చివేయించారు. ఆ తరువాత మిగతా వాటిని లైట్ తీసుకున్నారు. ఇదిలాఉంటే వరంగల్‌లో నాలాలు, చెరువు శిఖాల్లో ఇండ్లు కట్టుకున్న దాంట్లో చాలామంది దొంగ కాగితాలు సృష్టించుకున్నారని, వాటిని తొలగించే పరిస్థితి లేదని గత జులైలో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కొన్నేండ్ల కిందటే కట్టుకుని ఉంటున్న ఇండ్లను తొలగిస్తే కోర్టు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. అప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్లడం, గత ప్రభుత్వం కూడా లైట్ తీసుకోవడంతో నాలాల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.ఆక్రమ కట్టడాలు తొలగించలేక కొన్నిచోట్ల అధికారులు ఏకంగా నాలాల విస్తీర్ణాన్నే కుదించేశారు. హనుమకొండలో ప్రధానమైన నయీంనగర్ నాలా ఆక్రమణలతో 40 అడుగులకే పరిమితమైంది. చుట్టుపక్కల చాలాచోట్ల గత పాలకుల దగ్గరి వ్యక్తుల ఇండ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. నయీంనగర్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ఆక్రమించి బిల్డింగ్ కట్టాడు. 2023 జులైలో వచ్చిన వరదల నేపథ్యంలో నాలా విస్తరణ చర్యలు చేపట్టిన అధికారులు దానిని వంద అడుగులకు విస్తరించాల్సి ఉండగా, నేతల ఒత్తిడితో 82 అడుగులు అంటే 25 మీటర్లకే పరిమితం చేశారు. చాలాచోట్ల బఫర్ జోన్ ఏర్పాటు పేరున కాలువకు ఆనుకుని ఉన్న కాంపౌండ్లను కూల్చిన అధికారులు ఆ తరువాత పట్టించుకోకుండా వదిలేశారు.వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని భద్రకాళి, వడ్డేపల్లి, చిన్న వడ్డేపల్లి, కోట చెరువు, రంగసముద్రం(ఉర్సు), బంధం చెరువులు అన్యాక్రాంతం అయ్యాయి. బఫర్ జోన్లో ఇండ్లు ఉండడం మూలంగా వరద నీరు చెరువులోకి వెళ్లకుండా నగరంలోకి ప్రవేశించి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు 2010లో హైకోర్టును ఆశ్రయించారు. 14 సంవత్సరాల తర్వాత హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అక్రమ కట్టడాలు తొలగించి చెరువులు కాపాడాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో కదిలిన బల్దియాకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు 1094 అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేశారు. అనంతరం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 28, 10వ డివిజన్లలో సంతోషి మాత కాలనీ, సాయి నగర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, జయ కాలేజీ ఎఫ్‌టీఎల్, భద్రకాళీ చెరువు బఫర్ జోన్లలో అక్రమంగా కట్టిన 78 కాంపౌండ్లు, 28 రేకుల షెడ్లను తొలగించారు. పేదల ఇండ్లు తోలగించవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చెరువుల పరిరక్షణకు ఇబ్బంది కలుగకుండా పేదలకు సహాయం చేయాలే తప్ప నగరానికి ఇబ్బంది కలిగే పని చేయవద్దని ముంపు బాధిత ప్రజలు అధికారులను కోరుతున్నారు. బఫర్ జోన్, నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించి నగరానికి వరద, ముంపు బాధ లేకుండా చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
వడ్డేపల్లి నాలా ఇరువైపులా ఆక్రమణకు గురయ్యింది. చిన్నపాటి వర్షానికే హనుమకొండ ముంపునకు గురవుతుంది. చెరువులోకి డ్రైనేజీ వాటర్ రావడం వల్ల నీరు కలుషితం అవుతుంది. వర్షకాలం వరద నీటిలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిసారి నాయకులు మాటలు చెప్పడం, అధికారులు పనులు మొదలు పెట్టడం, ఏదో ఒత్తిడితో పనులు నిలిపి వేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికైనా నాలాలపై ఆక్రమణలు తొలగించాలి. – తుపాకుల దశరథం,
సామాజిక కార్యకర్తనాలాల అక్రమణదారులకు నోటీసులిచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. అక్రమణలను తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలి. కంటి తుడుపుగా చర్యలు చేపట్టి వదిలేయడంతో ప్రతి వర్షాకాలంలో వరద బాధిత కాలనీల్లో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వరదలో నష్టపోయిన వారిని ఆదుకున్న నాథుడే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారింది. – మందోటి మహేందర్, 56వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు
నాలాల ఆక్రమణల వల్ల గతంలో అనేకసార్లు మా కాలనీ నీట మునిగింది. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ప్రభుత్వం మారినా వారి తీరులో మార్పు రావడం లేదు. నాలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – యీంనగర్ నాలా పనులు ప్రారంభించడానికి వస్తుంటేనే కొంతమంది ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పండని వారికి చెబుతున్నా. నాలా ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించదు. మా నాన్న ఆక్రమించినా తొలగించాల్సిందేనని అధికారులకు చెప్పాం. ఆక్రమణ తొలగింపులో ఏ నాయకుడు తలదూర్చొద్దు.
నయీంనగర్ నాలాపై రాజాజీ నగర్ నుంచి కాకతీయ కెనాల్ యూటీ వరకు ఆక్రమణలు తొలగించి, రిటైనింగ్ వాల్స్ నిర్మించేందుకు దాదాపు రూ.90 కోట్లతో నిర్మాణం చేపట్టాం. రూ.200 కోట్లతో అలంకార్ సమీపంలోని నాలా అభివృద్ధి చేస్తున్నాం. బొందివాగు నాలా లైన్ క్లియర్ చేయడం సహా రూ.158 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం. రూ.60 కోట్లతో వడ్డేపల్లి చెరువు నుంచి గోపాలపూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మాణంతో కలిపి మొత్తంగా వరంగల్ నగరంలో వరద నివారణకు దాదాపు రూ.508 కోట్లతో పనులు ప్రభుత్వం చేపడుతుంది. నాలాపై ఆక్రమణల తొలగింపు సవాల్‌గా మారగా కూల్చివేతల విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఆక్రమణల తొలగింపు, డెవలప్‌మెంట్ పనుల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకుండా అధికారులు పనులు చేపట్టాలని ఆదేశించామంటున్నారు.