తెలంగాణ

తెలంగాణకు కొత్త రైల్వే లైన్

హైదరాబాద్, జూలై 30: తెలంగాణలోని ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల రైల్వే తీపి కబురు చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటైన జహీరాబాద్‌ వయా వికారాబాద్‌-పర్లీ వైజ్యనాథ్‌ ట్రైన్ మార్గం సెకండ్ లైన్ మంజూరు చేస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోని ట్రైన్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. వికారాబాద్‌-పర్లీ వైజ్యనాథ్‌ మార్గం డబ్లింగ్‌ పనులతో పాటు తాండూరు సిమెంట్‌ క్లస్టర్‌ నుంచి జహీరాబాద్‌ వరకు మరో కొత్త ట్రైన్ లైన్‌ ఏర్పాటుకు ఇటీవల సర్వే పనులు పూర్తయ్యాయి.ఈ మార్గాల్లో ట్రైన్ ప్రయాణికులతో పాటు సరకు రవాణా కోసం తాండూరు సిమెంట్‌ క్లస్టర్‌ నుంచి జహీరాబాద్‌ను కలుతూ ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రూ.1,350 కోట్ల నిధులతో 75 కి.మీ. పొడవునా ఈ కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో తెలంగాణలోని జహీరాబాద్, బంట్వారం, పెద్దేముల్‌ మండలాల మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని కుంచవరం తాలుకా ప్రాంతం వరకు ట్రైన్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్‌ సిటీకి మరో ట్రైన్ మార్గం కూడా అనుసంధానం కానుంది.జహీరాబాద్‌ మండలంలోని శేఖాపూర్‌-మల్‌చెల్మ గ్రామాలు, కోహీర్‌ మండలంలోని గొడిగార్‌పల్లి-బడంపేట్ గ్రామాలు, కర్ణాటకలోని కుంచవరం, వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలోని పెద్దేముల్‌, బొప్పనారం మండలంలోని ఇందూరు, తట్టేపల్లి, గొట్లపల్లి, తాండూరు మండలం కరణ్‌కోట్, మల్కాపూర్, చెల్కటూర్‌ గ్రామాల్లో కొత్త సేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.ఇక జహీరాబాద్‌ మీదుగా వికారాబాద్‌-పర్లీ వైజ్యనాథ్‌ ట్రైన్ మార్గాన్ని రెండో లైన్‌గా మార్చితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ప్రయాణాలు సాగించేవారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ మార్గంలో మొత్తం 270 కి.మీ. పొడవున రెండో లైన్‌ ఏర్పాటు పూర్తయితే రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. ఈ మార్గంలో 20 స్టేషన్ల మీదుగా అదనపు దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు పరుగులు తీయనున్నాయి. పాత మార్గం కావడంతో భూసేకరణ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. దీంతో త్వరలోనే రెండో లైన్‌ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారుఈ ట్రైన్ మార్గం నిర్మాణం కోసం ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ సర్వే పూర్తి చేసింది. ఆ సంస్థ తమ నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు సమర్పించింది. కొత్త ట్రైన్ మార్గంలో గేట్లు అవసరం లేకుండా ఆర్వోబీలు నిర్మించనున్నారు. అండర్‌ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణికులను నిర్దేశించిన గమ్యాలకు చేర్చేలా నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ మార్గాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరితగతిన పనులు చేపడితే రెండు మార్గాలకు మహర్దశ పట్టనుంది.