జాతీయం ముఖ్యాంశాలు

కేరళలో విరిగిపడిన కొండచరియలు

తిరువనంతపురం, జూలై 30: రళ వయానాడ్‌లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, వందల మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం  తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 4.10 గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే స్పందించారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ  ఫైర్‌ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. అదనపు NDRF బృందం కూడా వయనాడ్‌కు వెళుతోంది. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ నుంచి రెండు బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అయితే వందల మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని స్థానికుల ద్వారా అధికారులు తెలుసుకున్నారు.ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇండియన్ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్ సూలూరు నుంచి మెప్పాడి బయల్దేరాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. భారీగా కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. కాగా, అత్యవసర సేవల కోసం కేరళ ఆరోగ్య శాఖ -జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా మృతులు, ఘటనకు సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.