తిరుమల, జూలై 30: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు.. స్వామి వారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో (కోనేరు) స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేట్లో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్ట్ 1 నుంచి 31వ తేదీ వరకూ మూసివేయనున్నారు. ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనేట్లో స్నానం చేసేందుకు వీలుండదు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.శ్రీవారి పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి, పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో నీటిని నిల్వచేయరు. ఈ నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక నిరంతరంగా నీటిని శుద్ధి చేస్తూ వినియోగిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెలరోజులు కోనేటిని మూసివేసి మరమ్మత్తులు చేపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా మొదటి పది రోజులు కోనేట్లోని నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత పదిరోజుల పాటు మరమ్మత్తులు చేపడతారు. ఆఖరి పదిరోజుల్లో నీటిని నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం పనులను టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం చేపడుతూ ఉంటుంది.
కోదండరామస్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. జులై 31 నుంచి ఆగస్ట్ 2 తేదీ వరకూ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండో రోజు పవిత్ర సమర్పణ, మూడో రోజు వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల్లో పాల్గొనాలనుకునే భక్తులు రూ.500 చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది.