పెద్దపల్లి : శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష అని, తల్లి పాల ప్రాముఖ్యత పై వారోత్సవాల కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాల ను జిల్లా సంక్షేమ శాఖ అధికారి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తల్లిపాల వారోత్సవాలలోని ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన జిల్లాలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
మండల స్థాయిలో వైద్యశాఖ అధికారులు, ఐసిడిఎస్ సంయుక్తంగా సమావేశం నిర్వహించి తల్లి పాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించు కోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. నేటి నుండి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని, అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యే విధంగా ముందస్తు సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆగస్టు 2న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి లలో పర్యటించి పుట్టిన బిడ్డలకు గంట లోపు అందించే ముర్రె పాల విశిష్టత వివరించాలని, ముర్రె పాలు బిడ్డ ఎదుగుదలకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడు తుందని, ఈ అంశాన్ని విస్తృతంగా గర్భిణీ స్త్రీలకు తెలియజేయాలని అన్నారు. ఈ నెల 3 న అంగన్ వాడి కేంద్రాలలో అన్న సత్రాలను ఏర్పాటు చేసి పిల్లలు, గర్భిణీ స్త్రీలు అందించాల్సిన పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలని, ఆగస్టు 5, 6 తేదిలలో గర్భిణీ స్త్రీలు, బాలింతల ఇండ్లకు వెళ్లి తల్లి పాల ప్రాముఖ్యత వివరించాలని, ఈ నెల 7న శివశక్తి మహిళా సంఘాలకు తల్లి పాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై సమావేశం నిర్వహించాలని అన్నారు. తల్లి పాల వారోత్సవాల కార్యక్రమా ల్లో మండల ప్రత్యేక అధికారులు పాల్గొనాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.