ఆంధ్రప్రదేశ్

వెంటాడుతున్న పాపాలు...తాజా నేతలకు వరుస కష్టాలు

హైదరాబాద్, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్‌లో తాజా మాజీలకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికారంలో ఉండగా చేసిన తప్పిదాల కారణంగా ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.ఏపీలో తాజా మాజీలను కేసులు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యామన్న బాధ నుంచి తేరుకోక ముందే తాజా మాజీ అందరిపై కేసులు నమోదవడంతో పాటు, నేతలందరి చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఓడిపోయామన్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వేళ తాజాగా అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు, వచ్చిన ఆరోపణలపై నేతలందరికీ నోటీసలు అందుతున్నాయి. కేసులు నమోదు అవడంతో తాజా మాజిల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో నేతలు మొత్తం నియోజకవర్గం నుంచి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజా పరిణామాలతో నేతలంతా ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారుఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో పార్టీలోని నేతలందరికీ కేసులు భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది కీలక నేతలపైన పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే తీవ్రమైన ఆరోపణల నడుమ కొంతమంది నేతలు ఇప్పటికి ఆచూకీ లేకుండా పోయింది. ఇక మరికొందరు నేతలు వివాదాల నడుమ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మారి కొద్ది నెలలు కాగానే చిక్కుల్లో ఇరుక్కున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడుగా అడుగులు వేస్తోంది. అప్పట్లో విమర్శలు వివాదాలు ఆరోపణలకు కారణమైన అందరి నేతలపై విచారణకు ఆదేశించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లె ఫైల్స్ దహనం కేసు చుట్టుకొంది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ మొత్తం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్స్ దహనానికి తెర వెనక ఉండి కథ నడిపించారని ఆయన అనుచరుల పైన ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించి పలువురు నేతలను సైతం ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు.ఇక విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ చుట్టూ కిడ్నాప్ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో ఎంవివి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని, కుటుంబం మొత్తాన్ని బెదిరింపులకు దిగి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అరోపణల నడుమ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వివాదం చెల్లరేగింది. దీంతో అప్పటి కేసును రీ ఓపెన్ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా అప్పటి హత్యాయత్నం, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న అతని విచారించి ప్రస్తుతం కేసును రీ ఓపెన్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆదేశాలతోనే ఎంవివి కేసును తిరగ తోడేందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈవీఎం మిషన్ ధ్వంసం అలాగే హత్యాయత్నానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు తరలించారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. లిక్కర్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో కొడాలి నాని బెదిరింపులు గురిచేశారని ఆయనకు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం నాని కోర్టును ఆశ్రయించారు.ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ప్రస్తుతం వంశీని ఏ 71 గా చేర్చడంతో, వంశీ చుట్టు వివాదం రాజుకుంది. దీంతో ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాకాని, రామకృష్ణారెడ్డి ఇలా నేతలందరిపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉండటంతో తాజా మాజీలంతా చిక్కుల్లో ఇరుక్కుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పార్టీ నేతలు అందరి పైన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.కేవలం ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రమే అనుకుంటే తాజాగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పటి బేవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డితోపాటు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సైతం వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. ఏపీబీసీఎల్ ఎండిగా వాసుదేవ రెడ్డి ఉన్న సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు అనుమతి లేని బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు అలాగే అప్పటి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పక్కదారి పట్టించారన్న ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతం వాసుదేవ రెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని సస్పెండ్ చేసింది.ఇక రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్‌లకు అనుమతి ఇవ్వడంతోపాటు రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా వెంకటరెడ్డి వ్యవహరించాలని ఆయనపై కేసు నమోదు చేసింది. అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతున్న చర్యలు చేపట్టకపోవడం అనుచితంగా ప్రైవేటు వ్యక్తులు లబ్ధి చేకూర్చేలా వెంకటరెడ్డి వ్యవహరించాలని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనని ప్రభుత్వం సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. దీంతో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాత్రమే కాకుండా అధికారులపైన కూటమి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దీంతో వారి సైతం చిక్కుల్లో పడ్డారు.మొత్తానికి గత ప్రభుత్వంలో వాళ్లు వీళ్లు లేకుండా అవినీతి ఆరోపణలు వివాదాలకు కేంద్ర బిందుగా మారిన అందరి పైన ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో వారంతా అప్పటి వివాదాలు విమర్శలు నడుమ ఇప్పుడు చిక్కుల్లోపడ్డారు.