ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఠాగూర్ సినిమాను తలపించే విధంగా వైద్యం చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి బాలిక మరణించినా కూడా మెరుగైన వైద్యం కావాలంటూ అంబులెన్స్ ఎక్కించడంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని విజేత హాస్పిటల్ వారిపై బంధువులు ఆందోళనకు దిగారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన చెందిన ఎస్.డి ఉస్మాన్ పాషా, షబిహా దంపతుల కుమార్తె సనా తబుసుమ్ (15). ఈమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి హైస్కూలులో 10వ తరగతి చదువుతుంది. 2 రోజుల క్రితం విరోచనాలతో నీరస పడితే తల్లిదండ్రులు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్ద చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి పట్టణంలోని విజేత ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్లేట్ లెట్స్ 40వేల నుంచి 14వేలకు పడిపోయి బాలిక మృతి చెందింది.కానీ వైద్యులు మాత్రం బాలిక పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించి అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించిన బందువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సత్తుపల్లి పట్టణ సీ.ఐ టీ.కిరణ్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది మెరుగైన వైద్యం కావాలని అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం ఎందుకు చేశారని బంధువులు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు.దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, బీపీ డౌన్ అవ్వడం, డెంగ్యూ జ్వరంతో కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అవ్వడంతో బాలిక మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అంటున్నారు.