తెలంగాణ

విద్యా, వైద్యారంగాలకు పెద్ద పీట

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి గువ్వలగూడెం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. గ్రామంలో నేలకొండపల్లి మండలానికి చెందిన 140 లబ్ధిదారులకు రూ. 36,35,000 ల విలువ చేసే చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామన్నారు. అంతర్గత సిసిరోడ్లు, డ్రయినేజిల పనులు పూర్తిచేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆరు గ్యారంటీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు అధికారం చేపట్టిన నెల రోజుల్లోపే అమలుచేశామన్నారు. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రైతులను రాజులు చేయాలని, రైతు మొఖంలో ఆనందం చూడాలని నెల రోజులలోపే రూ. 31 వేల కోట్లు రైతు పంట రుణమాఫీ చేశామన్నారు. ధరణి తో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నెల, నెలన్నర రోజుల్లో ధరణి ని పూర్తి ప్రక్షాళన చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయనున్నట్లు, పాలేరు నియోజకవర్గానికి కొంత ఎక్కువ ఇండ్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. నెలాఖరులోపే రూ. 22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టబోతున్నట్లు ఆయన అన్నారు. పేదవారికి ఇండ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కొరకు దరఖాస్తు చేసిన నెల లోపు మంజూరు చేయనున్నట్లు ఆయన అన్నారు. ఆడబిడ్డల, రైతుల మొఖంలో ఆనందం చూడడం కోసం ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మొక్కలు నాటారు.
     అనంతరం మంత్రి చెన్నారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కూసుమంచి మండలానికి సంబంధించి 161 మంది లబ్దిదారులకు రూ. 46.20 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.