తెలంగాణ

ఈటల హయాంలో చీకటి రోజులే

  • మా భర్తలను చంపేందుకు కుట్రలు చేస్తున్నరు
  • ఈటల దళిత బాధితుల సంఘం నాయకుల సతీమణులు

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నన్ని రోజులు తమ కుటుంబాల్లో సంతోషమే లేదని ఈటల దళిత బాధితుల సంఘ నాయకుల సతీమణులు అన్నా రు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ కేసీ క్యాంపులో వారు మీడియాతో మాట్లాడారు. ఈటల దళిత యువజన సంఘం ఏర్పాటుచేసి తమ భర్తలను చంపడానికి ఈటల, ఆయన భార్య జమునారెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల ముందు ఈటల చేసిన భూకబ్జాలు, అక్రమాస్తుల బాగోతాలు బయటపెట్టినందుకు తమ భర్తలపై అనేక కేసులు పెట్టి రెండు నెలలు జైలుకు పంపించాడని, ఎన్నికల తర్వాత విడుదల చేసి పీడీయాక్టు పెట్టించిన దుర్మార్గుడు అని మండిపడ్డారు. ఇటీవల ఈటల దళిత యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి తమపై లేనిపోని ఆరోపణలు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తమ భర్తలపై ఈటల పెట్టించిన అక్రమ కేసులను సీఎం కేసీఆర్‌ ఎత్తివేయించాలని కోరారు. నియోజకవర్గంలో 45 వేలకు పైగా దళిత ఓట్లు ఉన్నాయని, వారందరినీ చైతన్యం చేస్తూ ఈటల ఓటమే లక్ష్యంగా పని చేస్తామని వారు స్పష్టంచేశారు. ఈటల రాజేందర్‌తోపాటు ఆయన భార్య జమునారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏసీపీ వెంకట్‌రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు.