తెలంగాణ

భారీగా పట్టుబడుతున్న గంజాయి....

హైదరాబాద్, ఆగస్టు 5: హైదరాబాద్ లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు ఈ గంజాయిని గుర్తించారు. దాదాపు 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఎస్వోటీ, శంషాబాద్ పోలీసులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2.94 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు చెప్పారు. 800 కేజీల గంజాయి కంటెయినర్ లో ఓ వాహనం ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు.ఈ స్థాయిలో గంజాయి తరలిస్తూ పట్టుబడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం డ్రైవర్ లు సంజీవ్ విఠల్ రెడ్డి, హోల్లప్ప, సప్లయర్ సునీల్ ఖోస్లా, జాగ సునాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాకు మూలకారకులైన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అరకుకు చెందిన వ్యక్తి గంజాయి సరఫరాదారుగా ఉన్నాడని, అతని పేరు రాము అని తెలిపారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇతను చాలా పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. కమీషన్ ఎజెంట్ కం ట్రాన్స్‌పోర్టర్ గా ఒడిశాకి చెందిన సోమ్ నాథ్ ఖారా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాము అనే వ్యక్తి గతంలో గంజాయి రవాణా చేస్తూ అరెస్ట్ అయ్యాడు. మెయిన్ పెడ్లర్ కం రిసీవర్ సురేష్ మారుతి పాటిల్ కూడా పరారీలో ఉన్నాడు. ‘‘ఇలా గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేసినందుకు ప్రతిసారి రూ.2 లక్షలు రూపాయలు తీసుకుంటారు. నిందితులు అంతా కలిసి ఎంతకాలంగా గంజాయి సప్లై చేస్తున్నారో విచారిస్తున్నాం. ప్రధాన నిందితుడు రాముతో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీస్ నిఘా తప్పించుకోవడానికి కంటైనర్ ముందు నిందితులు కార్ లో ఎస్కార్ట్ గా వచ్చారు. కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు. పోలీసుల నిఘానుండే తప్పించుకోవడానికి టోల్గేట్ వద్దకు కంటైనర్ రాంగానే వాహనం నంబర్ ప్లేట్ మారుస్తారు. నిందితులపై అనుమానంతో 15 నుండి 25 రోజులు వరకు ఈ కేసు పై వర్కౌట్ చేసాం. నిందితులు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి  పటాన్చెరువు వద్ద మరొక వెహికల్ లో గంజాయిని మారుస్తారు. మార్చిన ఆ వెహికల్ లో గంజాయిని మహారాష్ట్రకు తీసుకువెళ్తారు.విట్టల్ రెడ్డి పరవాడ సెజ్ లో సాల్వెంట్ డ్రమ్ములను కంటైనర్ లోడ్ చేసుకున్నాడు. కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు. కెమికల్స్ డ్రమ్ములను కూడా జిఎస్టి వేబిలు లేకుండా తరలిస్తున్నారు. ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా విచారణ చేస్తాం. మొత్తం ఏడుగురు నిందితులు గంజాయి సప్లై లో భాగంగా ఉన్నారు..ఇందులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసాం. మిగతా ముగ్గురు నిందితులను పరారీలో ఉన్నారు..వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటాం’’ అని పోలీసులు అన్నారు.