తెలంగాణ

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు

దళితుడిని కేసీఆర్ సీఎం చేస్తానని చెప్పారు: గీతారెడ్డి

కేసీఆర్ చెబుతున్న దళితబంధు పథకం బూటకమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. దళితుల గురించి కేసీఆర్ ఎన్నో చెప్పారని… ఇంతవరకు చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారని… చెప్పలేదంటే తాను తల నరుక్కుంటానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం గత ఏడేళ్లలో రూ. 85,913 కోట్లను కేటాయించారని.. అయితే కేవలం రూ. 47,685 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని… మిగిలిన రూ. 38 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని ఎక్కడ వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం కనీసం నోడల్ కమిటీ, స్టేట్ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించని ఘనత కేసీఆర్ సొంతమని గీతారెడ్డి మండిపడ్డారు. సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులనే ఖర్చు చేయని కేసీఆర్… ఇప్పుడు దళితులకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. లోన్ల కోసం 5.33 లక్షల మంది దళితులు దరఖాస్తు చేస్తే… అందులో 1.16 లక్షల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారని చెప్పారు.

దళితులకు ఏమీ చేయని కేసీఆర్… కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని గీతారెడ్డి దుయ్యబట్టారు. గత ఏడేళ్లలో అంబేద్కర్ విగ్రహానికి ఒక్కరోజైనా కేసీఆర్ పూలమాల వేశారా? అని ప్రశ్నించారు. ఉపఎన్నిక నేపథ్యంలో దళితులను ప్రగతి భవన్ కు పిలిపించి అంబేద్కర్ బొమ్మకి పూలమాల వేశారని చెప్పారు. దళితబంధు పథకాన్ని హూజూరాబాద్ కు మాత్రమే కాకుండా… రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.