- ఆగస్టు 15 నుంచి అమలు
- నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలి
- అధికార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
- 6 లక్షల మంది రైతులకు రుణ విముక్తి
- ఇప్పటికే తొలి విడతలో 3 లక్షల మందికి
- 25 వేల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ
- కరోనా కష్టాల్లోనూ అన్నదాతలకు దన్ను
- ఆనందోత్సహాల్లో తెలంగాణ రైతాంగం
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతగా గతేడాది రూ.25 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీచేసింది. తొలివిడతలో దాదాపు మూడు లక్షల మంది రైతులు లబ్ధిపొందారు.
ప్రస్తుతం చేపడుతున్న రెండో విడతతో కలుపుకొంటే రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య సుమారు 9 లక్షలకు చేరనున్నది. మొత్తం నాలుగు విడతల్లో రుణమాఫీని అమలు చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం 2021-22 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5,225 కోట్లు కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలుచేస్తున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నది. అప్పుడు మొత్తంగా 35,29,944 మంది రైతులకు సంబంధించిన రూ.16,243 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నది.
కరోనా కష్టకాలంలోనూ..
ఒకవైపు కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా.. ప్రభుత్వం రైతన్నల సంక్షేమం విషయంలో వెనకడుగు వేయడం లేదు. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ఠంచన్‌గా అందిస్తున్నది. రైతు బీమా అమలుచేస్తున్నది. కరోనా కష్టకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం దాదాపు రూ.17,500 కోట్లు వెచ్చించింది. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచింది. ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీకి పూనుకోవడం గొప్ప విషయమని వ్యవసాయరంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రూ.25 నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న చిన్న, సన్నకారు రైతులు లబ్ధిపొందనున్నారు. ఎందుకంటే, రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల్లో ఎక్కువభాగం వారే ఉంటారు. రెండో విడత రుణమాఫీ నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణపై క్యాబినెట్ సమీక్షించింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుతున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో సాగునీటి లభ్యత, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచటం తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించింది.
పత్తి సాగు మరింత పెంచాలి
తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్ నేపథ్యంలో పత్తి సాగును మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖను రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింత ప్రోత్సహించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.