- ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు
- వార్షికాదాయం 8 లక్షలలోపు వారికి వర్తింపు
- ఉద్యోగ నియామకాల్లో ఐదేండ్లు సడలింపు
రాష్ట్రంలోని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కోటా కింద అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లకు రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులు. వీరికి విద్య, ఉద్యోగాల్లో గరిష్ఠ వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ ఆదివారం నిర్ణయించింది. బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, మార్వాడీ, పార్శి, మార్వాడీ జైన్, ముస్లింలలోని సయ్యద్, ఖాన్ తదితర వర్గాల కుటుంబాలు రాష్ట్రంలో 21,65,170 ఉన్నాయి. 78,12,858 జనాభా ఉన్నది. ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 21 శాతం. వీరిలో దాదాపు 12 లక్షల కుటుంబాల వార్షికాదాయం రూ.8 లక్షలలోపే ఉంటుందని ఆయా కుల సంఘాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో సెంటు భూమి కూడా లేని అగ్ర కులాలవారు 16,20,682 మంది ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 4,64,647 మంది, పట్టణాల్లో 11,55,935 మంది నివసిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో విద్యాసంస్థల్లో 50 వేల సీట్లు ఉంటాయని ఉన్నతవిద్యామండలి అంచనావేసింది.
ప్రస్తుత కోటాకు ఢోకాలేదు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు పొందుతున్న రిజర్వేషన్లలో ఎటువంటి మార్పు లేకుండా ఈ చట్టం రూపొందించారు. పలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్ల కోటాలో ఎటువంటి మార్పు ఉండదు.