గుంటూరు, ఆగస్టు 17: అమ్మ.. అన్న..పేరు ఏదైతేనేం.. పేదోళ్ల కడుపులు నింపడానికి… ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా… తాము పెట్టుకున్న గడువుకున్నా ముందే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరుతో తీసుకొచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. నిజానికి గతంలోనే కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు.. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చింది అన్న క్యాంటిన్. జస్ట్ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లు వీటికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. ఉద్దేశం ఏదైనా.. రాజకీయంగా ఎవరెన్ని కామెంట్లు చేసినా.. పట్టణాల్లోని పేద, దిగువ మధ్యతరగతి వారి ఆకలిబాధ తీర్చాయి అన్న క్యాంటీన్లు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. అక్షయపాత్ర సహకారం అన్న క్యాంటీన్లలో కేవలం ప్రభుత్వ పాత్ర మాత్రమే లేదు. ఒకరకంగా అన్న క్యాంటీన్ బిల్డింగ్ కట్టించి, భోజనాలు తీసుకొచ్చే హాట్ బాక్స్‌లను మాత్రమే ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. ఆహారం రుచికరంగా వండి సమయానికి తగ్గట్టుగా ట్రాన్స్‌పోర్ట్‌తో సహా తీసుకొచ్చేది మాత్రం హరే కృష్ణ మూమెంట్‌కు చెందిన అక్షయ పాత్ర సంస్థ. బియ్యం కొనటం, వండటం, రుచికరంగా కూరలు వండి జాగ్రత్తగా తీసుకురావడం.. ఈ బాధ్యత తీసుకుంటోంది అక్షయపాత్ర ఫౌండేషన్. పైగా అన్న క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం ఖర్చు పెట్టేది చాలా తక్కువ. రోజుకు ఒక్కో మనిషికి మూడు పూటలకు కలిపి 90 రూపాయలు ఖర్చు అవుతుండగా 15 రూపాయలు మాత్రమే పేదవారి నుంచి కట్టించుకుని.. మిగతా 75 రూపాయలను ప్రభుత్వమే చెల్లించనుంది. మూడు పూటలా కలిపి రోజూ లక్షా 5వేల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35వేల మందికి టిఫిన్ అందిస్తారు. అంతే స్థాయిలో 35వేల మందికి మధ్యాహ్నం, 35 వేల మందికి రాత్రి సమయంలో భోజనం పెడతారు. ఒక్కో క్యాంటీన్లో సుమారు 350 మందికి సరిపడా ఆహారాన్ని మూడు పూటలా అందుబాటులో ఉంచుతారు.ఎన్ని సంక్షేమ పథకాలున్నా.. పేదల కడుపు నింపుతున్నది మాత్రం అన్నక్యాంటీనే. ప్రస్తుత లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు 200 కోట్ల రూపాయలు దీనికి ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఈ కార్యక్రమం కోసం విరాళాలు సేకరిస్తోంది ప్రభుత్వం. స్వయంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. తెలుగు ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.అనవసర ఖర్చులు, ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలివ్వండి. సేవ చెయ్యాలన్న ఆలోచనతో దాతలు ముందుకు రావాలి. మీరు మంచి పనికోసం 10 రూపాయలు ఖర్చు పెడితే.. మీ ఆదాయం 100 రూపాయలు పెరుగుతుంది. విరాళాలిచ్చేందుకు మరింత సౌకర్యంగా ఉండేందుకు డిజిటల్ విరాళాల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేశాం” అని చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా దాతలకు పిలుపునిచ్చారు. ఒక్కరోజేప్రభుత్వానికి అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం సుమారు రూ.2కోట్లకు పైగా విరాళాలను దాతలు అందించారు. దీంతో ఇలా సేకరించిన విరాళాలకు అకౌంట్‌బులిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌బిఐలో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచింది ప్రభుత్వం. ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే ఆ ఖాతాకు కూడా నేరుగా పంపించవచ్చు.అన్న క్యాంటీన్ల విరాళాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు
ఖాతా పేరు: అన్న క్యాంటీన్స్
ఖాతా నెంబర్: 37818165097
బ్రాంచి: చంద్రమౌళినగర్, గుంటూరు
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్: SBIN0020541
రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోగా ప్రారంభించాలన్నది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే 100 క్యాంటీన్లు మొదలయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారానికల్లా మిగతా వాటిని కూడా ప్రారంభిస్తామని ఏపీ సీఎం చెప్పారు. ” అన్న క్యాంటీన్లను ట్రస్టు ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం” అని చంద్రబాబు ప్రకటించారు.