ఆంధ్రప్రదేశ్

పిఠాపురంపై మెగా ప్లాన్ఁ

కాకినాడ, ఆగస్టు 17: మెగాస్టార్ చిరంజీవి వారసులుగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌ల స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. తమ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.  పవన్ కల్యాణ్‌ పుణ్యామాని ఇప్పుడు ఇక్కడ చూసిన పిఠాపురం పేరు మార్మోగిపోతుంది.  ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్ర కేబినెట్లో డిప్యూటీ సీఎంగా  కీలక భూమిక పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి పవన్ కళ్యాణ్ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు.  ఇదిలా ఉంటే పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం  ప్రజలకోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చినట్లు సమాచారం. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్- ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైద్య సేవల రంగంలో దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా ఉన్న అపోలో పిఠాపురంలో ఏర్పాటు కానుంది.జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌ తో మాట్లాడి అపోలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని.. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందజేస్తానని హామీ ఇచ్చారు.  ఈ క్రమంలో పిఠాపురం నుంచి 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో పవన్‌ కళ్యాణ్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలపై పవన్  దృష్టి సారించారు. తన బాబాయ్‌ హామీని నెరవేర్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలో పది ఎకరాల స్థలాన్ని కూడా రామ్‌ చరణ్, ఆయన సతీమణి, అపోలో లైఫ్‌ సంస్థల చైర్‌ పర్సన్‌ ఉపాసన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అపోలో ఆస్పత్రులు సేవలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ హాస్పిటల్‌ చైన్‌ గా కూడా అపోలో సంస్థలకు పేరుంది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీ ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురంలోనూ అపోలో ఆస్పత్రి ఏర్పాటుకానుంది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్‌ పార్టీ జనసేన తరఫున ప్రచారం చేసిన ఆయన అన్న నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్‌ తేజ్, హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సైతం పిఠాపురం తమ కుటుంబానికి ప్రత్యేక ప్రదేశంగా నిలుస్తుందన్నారు. తమ హృదయంలో పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ సమయంలో చెప్పుకొచ్చారు. ఇదే స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కులమతాలకతీతంగా పవర్ స్టార్ కు ఘనవిజయం అందించారు. దీంతో ఇచ్చిన హామీలపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అతి త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆస్పత్రి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలు అయ్యాయి. అపోలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రే కాకుండా నియోజకవర్గానికి అవసరమైన ఇతర ప్రజోపయోగ పనులను చేపట్టడానికి సొంత నిధులను సైతం వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఆయన ఆశించినట్టు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారబోతుందని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.