విజయవాడ, సెప్టెంబర్ 2: సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికికారణమైంది.విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.విటిపిఎస్ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.విటిపిఎస్ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు ఇందులో భాగస్వామ్యం ఉంది.బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.
Related Articles
జస్టిస్ శివశంకర్ మరిన్ని పుస్తకాలు రచించాలి
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే […]
వచ్చే వారం ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల పై విద్యాశాఖ కీలక అ…
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ నమూనాకు ప్రత్యేక పూజలు జరిపారు. ప్రయోగానికి ముందు రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేయడం అనవాయితీ….