thammineni
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మళ్లీ తమ్మినేనికి పెద్ద పీట...

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. దీంతో అధినేత జగన్ పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను మార్చేందుకు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఒకేలాంటి ఫలితాలు వచ్చాయి. దాంతో వైసీపీ అధికారంలో కోల్పోవాల్సి వచ్చింది. ఓటమికి గత కారణాలు అన్వేషిస్తునే తొలుత జిల్లా అధ్యక్షులను మార్చాలనే నిర్ణయానికి వైసీపీ అధినేత జగన్‌ వచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కృష్ణదాసును తప్పించే అవకాశం ఉంది. ఆ స్థానాన్ని మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా తమ్మినేని పనిచేశారు. మళ్లీ ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా కళింగులకు వైసీపీ పెద్దపీట వేసిందనే సంకేతాలు పంపినట్టు అవుతుందని అధిష్ఠానం భావిస్తోంది.

ఈ మార్పు స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీకి ప్లస్ అవుతుందనేది జగన్ ఆలోచన. వైసీపీ అధిష్టానం తీసుకోబోతున్న నిర్ణయాన్ని ముందే పనిగట్టిన కృష్ణదాస్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత.. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కృష్ణదాస్ ఒక్కరే వెళ్లలేదు. తన వెంట మాజీ ఎమ్మెల్యేలు గొర్రె కిరణ్‌ కుమార్, రెడ్డి శాంతి, పిరియా సాయిరాజ్, పిరియా విజయ, పేరాడ తిలక్లను తీసుకెళ్లారు. వైసీపీ కీలక నేత సుబ్బారెడ్డిని కూడా ఇలాగే ఎన్నికల తర్వాత ఓసారి కలిసొచ్చారు.ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్ నియోజకవర్గానికి వెళ్లినా స్థానిక నాయకులకు ముందే సమాచారం అందిస్తున్నారు. పర్యటన విజయవంతం చేయాలని కోరుతున్నారు. దీనివల్ల తన నాయకత్వానికి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల ఆమోదం ఉందనే సంకేతాలు పంపిస్తున్నారు. అందరూ తన వెనుకే ఉన్నారనే టాక్ బయటకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

జిల్లా అధ్యక్ష పదవిని కాపాడుకునే యత్నాలను దాస్‌ ముమ్మరం చేశారనే ప్రచారం సాగుతోంది.ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా కూడా కొనసాగారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను కూడా కృష్ణదాస్ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కార్యక్రమాలన్నింటినీ ఆయనే చూస్తున్నారు. ఈ నియోజకవర్గం బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగిస్తే తమ్ముడు ప్రసాదరావుకు ముప్పు వస్తుందనేది ఆయన భావన. అందుకే ఇక్కడ ఎవరినీ ఇన్వాల్వ్ చేయడంలేదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ తరఫున కొత్త నాయకులు తయారు కాకుండా అన్నదమ్ములిద్దరూ జాగ్రత్త పడుతున్నారు. తమ్మినేని సీతారాం వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతిన వ్యవహరించారో అదే పంథా కొనసాగిస్తున్నారు. ఇటీవల బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఒంటరిగానే కలిశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తమ్మినేని పేరు ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. అయినా పది మందిని కలుపుకొని వెళ్లే ఆలోచన చేయడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.