ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

గ్రామ కంఠాల్లోని ఆస్తులకు సర్టిఫికెట్లు

తొలి విడత కింద వంద గ్రామాల్లో 25 వేల ఆస్తులకు సర్టిఫికెట్లు

ఆగస్టు 15న పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

గ్రామ కంఠాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణే లేదు

వీటన్నిటికీ ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’లో సర్టిఫికెట్లు 

753 గ్రామాల్లో సర్వే పూర్తి.. గ్రామాల వారీగా మ్యాప్‌లు సిద్ధం చేసిన సర్వే ఆఫ్‌ ఇండియా  

ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనుందని సమాచారం. దాదాపు 100  గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల వరకు ఆస్తులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ధ్రువీకరణ పత్రాలు అందజేయించాలని పంచాయతీరాజ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

241 గ్రామాల్లోని ఆస్తులకు మ్యాప్‌లలో మార్కింగ్‌.. 
గ్రామ కంఠాల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రాల్లేవు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా ఇప్పటిదాకా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యిందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు మ్యాప్‌లలో మార్కింగ్‌ చేశారు. వీటిని పంచాయతీరాజ్‌ శాఖకు సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయతీరాజ్‌ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే.. వాటి వివరాలను మ్యాప్‌కు జత చేసి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరాలను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్‌లను తయారు చేస్తారు. తుది మ్యాప్‌లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తారు. పంచాయతీరాజ్‌ శాఖ ఒక్కొక్క ఆస్తికి.. దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్‌ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. 

16 గ్రామాల్లో 3,170 ఆస్తుల వివరాలు సిద్ధం 
ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్‌లు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా బూతుమిల్లిపాడు పరిధిలోని గ్రామ కంఠంలో ఉన్న ఆస్తుల గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ పరిశీలించారు.